బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అమెరికా లాంటి దేశంలోనే 50 రాష్ట్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత్‌లో ఉంటే నష్టమేంటని అంటున్నారు 


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌... మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చాలా విషయాలు వివరించారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో వివరించారు. వీటితోపాటు దేశంలో ఉన్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్స్‌పై కూడా స్పందించారు.  


దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్లు ఉన్నాయని తెలిపారు కేసీఆర్. బిహార్‌లో మిథిలాంచల్‌  కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారని వివరించారు. తాము తెలంగాణ పోరాటం మొదలు పెట్టక ముందు పదేళ్ల నుంచి ఢిల్లీలో పోరాడుతున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతున్నా వారి పోరాటం ఇంకా కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. దీన్ని కేంద్రం సీరియస్‌గా ఆలోచించాలన్నారు. 






ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తాము 33 జిల్లాలను అభివృద్ధి చేశామని తెలిపారు. దీని వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పెద్ద జిల్లాలు ఉంటే అది సాధ్యమయ్యేది కాదన్నారు. అమెరికా లాంటి 34 కోట్ల జనాభా ఉన్న దేశమే 50 రాష్ర్టాలను ఏర్పాటు చేసుకుందన్నారు. మరి భారత్‌లో కూడా మరో 10-15 రాష్ట్రాలు ఏర్పడితే వచ్చే నష్టమేమీ లేదు కదా అని కామెంట్ చేశారు. 


దేశంలో ఏ వర్గం ఆనందంగా లేదన్నారు కేసీఆర్. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సారవంతమైన నేలలు ఉండగా పప్పుధాన్యాలను కూడా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు ఇలా ఉండటానికి పార్టీలో వ్యక్తులో కాదన్నారు కేసీఆర్. వ్యవస్థల్లోనే మార్పులు రావాలని ఆకాంక్షించారు. 






వ్యవస్థల్లో, పరిస్థితుల్లో మార్పు కోసమే బీఆర్‌ఎస్ పని చేస్తోందన్నారు కేసీఆర్. ఎవరినో ఒకర్ని గెలిపించడానికో... ఓడించడానికో బీఆర్‌ఎస్ పుట్టలేది...మార్పు కోసం పని చేస్తోందని తెలిపారు. గుణాత్మకమైన మార్పు తీసుకురావడమే తమ పార్టీ ప్రధాన అజెండాగా అభివర్ణించారు. 






త్వరలోనే ఢిల్లీలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా విధానంపై ప్రకటన చేస్తామన్నారు కేసీఆర్. మహిళలకు రాజకీయాల్లో అవకాశాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పించాలన్నారు. గత ప్రభుత్వానికి చాలా సలహాలు ఇచ్చామని అవేవీ ఆచరణ సాధ్యం కాలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే మాత్రం చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత పెంచుతామన్నారు. 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు.