Kamal Haasan: నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ ఓ మహిళా బస్సు డ్రైవర్ కు కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఆమె ఇటీవలె తన ఉద్యోగాన్ని కోల్పోయారు. దీంతో ఆమెకు కారు బహుమతిగా ఇచ్చిన కమల్ హాసన్.. జీవితంలో ఎంతో మందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆమెను తన ఆఫీసుకు పిలిపించుకుని కారు గిఫ్ట్ గా అందించారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల కోవైలో పర్యటించిన సందర్భంగా ఓ మహిళ డ్రైవర్ బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో బస్సు కండక్టర్.. ఎంపీకి టికెట్ ఇవ్వడాన్ని ఆ మహిళా బస్సు డ్రైవర్ తప్పుపట్టారు. దీంతో ఆ ట్రావెల్స్ యాజమాన్యం ఆమెను విధుల నుంచి తొలగించింది. ఈ వివాదంపై స్పందించిన కమల్ హాసన్ ఆమెకు తన వంతు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.
'పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షిస్తూ..'
కోయంబత్తూర్ తొలి మహిళా బస్సు డ్రైవర్ షర్మిల అంశం చర్చనీయాంశంగా మారడం తనను ఎంతో బాధించిందని చెప్పారు కమల్ హాసన్. యువతకు ఆమె ఎంతో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. షర్మిల కేవలం డ్రైవర్ గానే మిగిలిపోకుండా.. ఎంతో మంది షర్మిలలను సృష్టించాలనేది తన ఆకాంక్షగా చెప్పారు. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున షర్మిలకు కారును అందజేస్తున్నట్లు తెలిపారు. కేవలం క్యాబ్ సర్వీసులకే పరిమితం కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించాలని, పారిశ్రామిక వేత్తగా ఎదగడానికి ఈ కారును వినియోగించుకోవచ్చని కమల్ హాసన్ పేర్కొన్నారు.
బస్సు డ్రైవర్ వివాదం ఏంటంటే?
డీఎంకే నేత, ఎంపీ కనిమొళి ఇటీవల కోయంబత్తూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రైవేట్ సంస్థకు చెందిన బస్సులో ప్రయాణించారు. ఆ బస్సును ఓ మహిళ నడుపుతున్నట్లు తెలుసుకుని, ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ ఆమెను సత్కరించారు కనిమొళి. మహిళా డ్రైవర్ షర్మిలకు తన చేతి గడియారాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఈ సమయంలో ఎంపీ కనిమొళితో బస్సులో శిక్షణలో మహిళా కండక్టర్ అనుచితంగా ప్రవర్తించిందంటూ.. షర్మిల ఆమెపై ట్రావెల్స్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో.. తను పాపులర్ అయ్యేందుకు తరచూ సెలబ్రిటీలను బస్సులో ప్రయాణించడానికి ఆహ్వానిస్తూ.. ప్యాసెంజర్లను అసౌకర్యానికి గుర్తి చేస్తున్నట్లు ఆ కండక్టర్ కూడా షర్మిలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువైపుల వాదనలు విన్న ఆ ట్రావెల్స్ యాజమాన్యం షర్మిలను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అది కాస్త చర్చనీయాంశంగా మారిపోవడంతో తాజాగా కమల్ హాసన్ ఆమెకు కారును గిఫ్ట్ గా ఇచ్చారు.
Also Read: Monsoon in India: దేశంలో 80 శాతానికి పైగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, ఇక వానలే వానలు!
షర్మిల ఎవరంటే..
కోయంబత్తూరుకు చెందిన షర్మిల తెలియని వారంటూ ఉండరు. చిన్న వయస్సులోనే తొలి మహిళా బస్సు డ్రైవర్ గా ఆమె చాలా మందికి సుపరిచితమే. కోయంబత్తూరు జిల్లా వాడవల్లి ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ మహేష్ కుమార్తె షర్మిల. ఆమె వయస్సు 24. తనకు డ్రైవింగ్ నేర్పించాలని పట్టుబట్టడంతో ఆమె తండ్రి షర్మిలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించారు. గతేడాది 2019 నుంచి కోయంబత్తూరులో షర్మిల ఆటో నడుపుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారీ వాహనాల వైపు వెళ్లారు. ఆ తర్వాత ఆమె బస్సు నడుపుతుండగా తీసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ మహిళా బస్సు నడుపుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు వచ్చి ఆమెను సత్కరించడం ప్రారంభించారు. అలా ఇటీవల కనిమొళి కూడా షర్మిలను సత్కరించగా.. అది కాస్త వివాదానికి దారి తీసింది. అయితే షర్మిలను ఉద్యోగంలో నుంచి తొలగించారని వార్తలు రాగా.. షర్మిలనే తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial