Udhayanidhi Stalin Remark:
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చి చిక్కుల్లో పడ్డారు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని...పూర్తిగా సమాజంలో నుంచి నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయానికి ఈ ధర్మం వ్యతిరేకం అని తేల్చి చెప్పారు. Sanatana Abolition Conference లో మాట్లాడిన సందర్భంలో ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
"కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు. పూర్తిగా సమాజం నుంచి తొలగించాలి. డెంగ్యూ. మలేరియా, కరోనాను ఎలాగైతే నిర్మూలిస్తున్నామో...అదే విధంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతనం అనేది సంస్కృత పదం. సామాజిక న్యాయానికి ఇది పూర్తిగా విరుద్ధం"
- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలు వరుస పెట్టి ట్వీట్‌లతో విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ మౌనంగా ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. I.N.D.I.A కూటమిలోని పార్టీలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకమే అని మండి పడుతున్నారు.
"ఓవైపు రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం తెరిచాను అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎమ్‌కే మంత్రి ఉదయ నిధి స్టాలిన్ మాత్రం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. అంటే ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టేగా. ఇప్పుడు ఆ కూటమి ఉద్దేశాలేంటన్నది స్పష్టంగా అర్థమవుతున్నాయి. వాళ్లకు అవకాశమిస్తే దేశాన్ని ముక్కలు చేస్తారు"
- అమిత్ మాల్వియా, బీజేపీ నేత
ఉదయనిధిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ ట్వట్ చేయగా...దీనిపైనా ఆయన స్పందించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు.
"లీగల్‌గా ఎలాంటి సవాళ్లు ఎదురైనా నేను సిద్ధమే. ఇలాంటి బెదిరింపులుకు నేనేమీ భయపడిపోను. మేం పెరియార్ చూపిన బాటలోనే నడుస్తున్నాం. సామాజిక న్యాయం కోసం ఎంత పోరాటమైనా చేస్తాం. ఇప్పుడే కాదు. ఎప్పుడూ అదే అంటాను. ఈ ద్రవిడ భూమి నుంచి సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం"