New Parliament: మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మహిళా ప్రముఖులు కేంద్రం చర్యపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. ఇవాళ తమన్నా భాటియా, మంచు లక్ష్మీ, ఖుష్బు కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నారీ శక్తి వందనం బిల్లును కొనియాడారు. సామాన్య మహిళలు రాజకీయాల్లోకి రావడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు దోహదపడుతుందని హీరోయిన్ తమన్నా భాటియా వ్యాఖ్యానించారు. 


'మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల సామాన్య మహిళలు కూడా రాజకీయాల్లోకి రావడానికి దోహదపడుతుంది' అని హీరోయిన్ తమన్నా అన్నారు.






మహిళా రిజర్వేషన్ బిల్లుపై నటీమణి దివ్యా దత్తా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చొరవ అద్భుతమని కొనియాడారు. ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగడం బాగుందని తెలిపారు. 


'మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ చొరవ అద్భుతం. మహిళలకు ప్రతి అంశంలో ప్రాధాన్యత పెరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను వీక్షించడం అద్భుతంగా ఉంది' అని నటీ దివ్యా దత్తా పేర్కొన్నారు.






మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 ని రాజ్యసభలో ప్రవేశపెట్టిన వేళ సాక్ష్యంగా ఉన్న ఘనత తనకు దక్కుతుందని నటి ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సాక్ష్యంగా తమను ఆహ్వానించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ఖుష్బూ ధన్యవాదాలు తెలిపారు.






మంగళవారం బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. సినీతారలు షెహ్‌నాజ్‌ గిల్, భూమి ఫడ్నేకర్ కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్లు ఓ కీలక ముందడుగు అవుతుందని, మహిళలకు హక్కులు, సమానత్వం కల్పిస్తే తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు అండగా ఉంటారని అన్నారు.