Supreme Court on Luggage: 



ప్రయాణికులదే బాధ్యత..


"రైల్లో ప్రయాణించేటప్పుడు మీ సామాన్లకు మీరే బాధ్యత వహించాలి. అవి మిస్ అయితే...అందుకు రైల్వే బాధ్యత వహించదు". స్వయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. ట్రైన్‌లో ట్రావెల్ చేసే సమయంలో సామాన్లను ఎవరైనా దొంగిలిస్తే...ఆ నిందను రైల్వేపై వేయడం సరికాదని తేల్చి చెప్పింది. ఎవరి సామాన్లకు వాళ్లే బాధ్యులు అని స్పష్టం చేసింది. సామాన్లు పోగొట్టుకున్న ఓ వ్యక్తి పిటిషన్ వేయగా...కన్జ్యూమర్ ఫోరమ్‌ని ఆశ్రయించాడు ఓ బాధితుడు. రైల్వే రూ.లక్ష చెల్లించాల్సిందేనని ఫోరమ్ తేల్చి చెప్పింది. ఆ తరవాత ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ పిటిషన్‌ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం...కన్జ్యూమర్ ఫోరమ్‌ తీర్పుని తోసిపుచ్చింది. 


"రైళ్లో ప్రయాణించే సమయంలో ఎవరు తమ వస్తువులు పోగొట్టుకున్నా, వాటిని ఎవరి దొంగిలించినా అందుకు రైల్వే బాధ్యత వహించదు.  రైల్వే లోపం కారణంగానే అలా జరిగిందని వాదించలేం. ప్రయాణికులే తమ సామాన్లను జాగ్రత్తపరుచుకోవాలి. ప్రయాణికుల నిర్లక్ష్యానికి రైల్వే ఎలా బాధ్యత వహిస్తుంది."


- సుప్రీంకోర్టు ధర్మాసనం 


2005 నాటి కేసు..


ఇదంతా 2005 నాటి కేసు విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఓ బిజినెస్‌మేన్ కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి వెళ్తుండగా...తనతో పాటు రూ.లక్ష తీసుకెళ్లాడు. రాత్రి పడుకుని ఉదయం లేచి చూసే సరికి తన బ్యాగ్‌ని ఎవరో కట్ చేసినట్టు గుర్తించాడు. అందులో ఉన్న డబ్బు దొంగిలించారు. వెంటనే జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరవాత కన్జ్యూమర్ ఫోరమ్‌కి వెళ్లాడు. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు..చివరకు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ధర్మాసనం...అలా తీర్పునిచ్చింది.