Swiggy Controversy: సోషల్ మీడియా ఎంట్రీతో... ఎవరైనా చిన్న తప్పు చేసినా పెద్ద దుమారం రేగుతుంది. క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ మధ్య బ్లింకిట్ ప్రకటన వైరల్ అవ్వగా...తాజాగా స్విగ్గీ ప్రకటన వైరల్ అవుతోంది. అయితే స్విగ్గీ ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. #HinduPhobicSwiggy అనే యాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తూ స్విగ్గీపై మండిపడుతున్నారు. అయితే స్విగ్గీ ప్రకటనతో ఈ దుమారం రేగింది. హోలీ పండగ సందర్భంగా సిగ్గీ బిల్ బోర్డ్ ప్రకటన ఇచ్చింది.
వివాదాస్పద బిల్ బోర్డు
స్విగ్గీ వివాదాస్పద బిల్‌బోర్డ్ ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. హోలీ రోజున ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. స్విగ్గీ పెట్టిన బిల్‌బోర్డ్‌లో రెండు గుడ్లు ఉన్నాయి.. పక్కన “ఆమ్లెట్; సన్నీ సైడ్-అప్; కిసీ కే సర్ పర్. #BuraMatKhelo. ఇన్‌స్టామార్ట్‌లో హోలీ సరుకులు పొందండి" అని రాసిఉంది. ఈ ప్రకటనతో వివాదం మొదలైంది. నెటిజన్లు స్విగ్గీపై మండిపడుతూ... వినియోగదారులు తమకు నచ్చిన విధంగా హోలీని జరుపుకుంటారని, అందుకు స్విగ్గీ అనుమతి అవసరంలేదన్నారు. ఒక నెటిజన్ స్విగ్గీని ట్యాగ్ చేసి, “ఈద్ సందర్భంగా ముస్లింలు మేకలను వధించడం మానుకోవాలని లేదా క్రిస్మస్ సందర్భంగా చెట్లను నరకవద్దని క్రైస్తవులను కోరుతూ మీరు అదే బిల్‌బోర్డ్‌ను పెట్టగలరా? మీ హిందూ ఫోబియాను మా పండుగల నుంచి దూరంగా ఉంచండి, హిందువులు కోరుకున్న విధంగా హోలీని జరుపుకుందాం." అని రాసుకొచ్చారు.
క్షమాపణలు చెప్పాలని డిమాండ్
SCKON వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ మాట్లాడుతూ.... స్విగ్గీ శాఖాహారులకు నాన్ వెజ్ వస్తువులను పంపుతుందని ఆరోపించారు. గతంలో వెజ్ ఆర్డర్ చేసిన వారికి నాన్-వెజ్ వస్తువులను పంపిందన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. రాధారామన్ దాస్ ట్వీట్ చేస్తూ, “హోలీ సందర్భంగా హిందువులకు జ్ఞానాన్ని అందించడానికి స్విగ్గీ ప్రచారం ప్రారంభించింది. #BuraMatKhelo హ్యాష్‌ట్యాగ్‌తో భారీ ప్రకటన ఇచ్చింది. అదే కంపెనీ శాఖాహారులు, శాఖాహార వస్తువులను ఆర్డర్ చేసిన వారి కస్టమర్లలో కొంతమందికి నాన్-వెజ్ వస్తువులను పంపడంలో కూడా ప్రసిద్ధి చెందింది" అన్నారు. ఆల్ ఇండియా సాధు సమాజ్ సభ్యుడు, కచ్ సంత్ సమాజ్ మాజీ అధ్యక్షుడు యోగి దేవ్‌నాథ్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ ప్రకటనపై స్విగ్గీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవ్‌నాథ్ ట్వీట్ చేస్తూ, “ స్విగ్గీ హిందువుల పండుగలపై వివాదాస్పద ప్రకటనలు సరైంది కాదు. మీ హోలీ రీల్, బిల్‌బోర్డ్ హోలీ ప్రకటన తప్పుడు అవగాహన సృష్టిస్తోంది. మీరు క్షమాపణలు చెప్పాలి. సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి." అన్నారు.
స్విగ్గీ ప్రకటనపై భిన్న వాదనలు
శివసేన నేత రమేష్ సోలంకి ట్వీట్ చేస్తూ, “లక్షలాది మంది జరుపుకునే పండుగ పట్ల స్విగ్గీ అగౌరవంగా మాట్లాడుతుంది. ఇతర హిందూయేతర పండుగలపై అలాంటి సమాచారం ఎందుకు లేదు? ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకు స్విగ్గీ హిందువులకు క్షమాపణలు చెప్పాలి. ఇటీవల స్విగ్గీ ప్రకటన ప్రచారంపై కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు మండిపడగా, మరికొందరు ఈ ప్రకటనకు మద్దతుపలుకుతున్నారు. ఓ నెటిజన్ “ఒకరి తలపై గుడ్లు పగలగొట్టడం హోలీలో భాగమా? స్విగ్గీ ప్రకటనలో హోలీ కోసం ఒకరి తలపై గుడ్లు పగలగొట్టవద్దని ప్రజలను కోరుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఏవిధంగా చెడు?" అని స్విగ్గీకి మద్దతుగా నిలిచారు. అయితే చాలా మంది నెటిజన్లు స్విగ్గీ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేస్తూ ఫొటోలు పెడుతున్నారు.