Mahua Moitra Issue : లోక్‌సభ (Loksabha)నుంచి తనను బహిష్కరించటాన్ని సవాల్‌ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నేత (TMC) మహువా మోయిత్రా  (Mahua Moitra) సుప్రీంకోర్టు (Suprem Court)ను ఆశ్రయించారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసులో తనను కూడా ఇంప్లీడ్‌ చేయాలని అధికార పార్టీ ఎంపీ నిశికాంత్‌ దుబే (Nishikanth Dube ) అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. తాను చేసిన ఫిర్యాదు ఫలితంగానే మహువా బహిష్కరణకు గురయ్యారని తెలిపారు. తనను కూడా ఈ కేసులో ఓ పక్షంగా చేర్చుకోవాలని కోరుతూ నిషికాంత్ దుబే దరఖాస్తు చేశారు. బహుమతులు తీసుకొని సభలో మహువా ప్రశ్నలు అడిగారన్న ఫిర్యాదును విచారించిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ.. మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా లోక్‌సభ.. ఆమెను సభ నుంచి బహిష్కరించింది. దీన్ని సుప్రీంకోర్టులో మహువా సవాల్‌ చేశారు. మొయిత్రా పిటిషన్‌ను తక్షణం విచారించాలని ఆమె తరఫున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి ( Abhishekh Manu singhvi )సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ను కోరారు. స్పందించిన సీజేఐ...ఈ-మెయిల్‌ పంపితే వెంటనే పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.


ఎథిక్స్ కమిటీ నివేదికతో మహువాపై వేటు


పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమెను బహిష్కరించాలని డిమాంండ్‌ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానాన్ని పెట్టారు. అయితే ఈ తీర్మానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయమివ్వాలని, నివేదికపై ఓటింగ్‌కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీ సహా పలువురు విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌ నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ అంగీకరించింది. ఆమె ఇక ఎంపీగా కొనసాగడం తగదని స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.


ఖరీదైన కానుకలు తీసుకొని లోక్ సభలో ప్రశ్నలు
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంట్ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది, ఆమె మాజీ స్నేహితుడు జై అనంత్‌ దెహద్రాయ్‌ ను కమిటీ విచారించింది. అనంతరం 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్‌ కమిటీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది.  2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు మహువా అడిగారని నిషికాంత్‌ తెలిపారు.