Supreme Court on Hate Speech : మతం పేరుతో విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలపై సుప్రీంకోర్టు స్పందించింది. మతం పేరుతో మనం ఎక్కడికి చేరుకున్నామని  ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మతం పేరుతో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఏ మతానికి చెందినవారిపైనా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి ప్రసంగాలపై పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి కేసు నమోదు చేయాలని ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఎవరైనా ఫిర్యాదు చేసేంత వరకు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కోర్టు ధిక్కరణాగ పరిగణిస్తామని తెలిపింది.  


నిరంతరం హింసాత్మక ప్రకటకలు 


విద్వేషపూరిత ప్రసంగాలపై పిటిషనర్ షాహీన్ అబ్దుల్లా మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా నిరంతరం హింసాత్మక ప్రకటనలు చేస్తున్నారని, భయానక వాతావరణం ఉందని కోర్టుకు తెలిపారు. కానీ ముస్లింలు కూడా ద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని కోర్టు తెలిపింది. అన్ని సందర్భాల్లో నిష్పాక్షిక చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.


బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఉదహరించిన కపిల్ సిబల్


 బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ లతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రస్తావించారు. "ముస్లింల ఆర్థిక బహిష్కరణ గురించి ఎంపీ పర్వేష్ వర్మ మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో మరో నాయకుడు గొంతు కోయడం లాంటిదేదో చెప్పాడు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ధర్మ సంసద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎలాంటి ప్రభావం చూపడం లేదు." అని కపిల్ సిబల్ అన్నారు. 


మతం పేరుతో విద్వేషాలు 


 హేట్ స్పీచ్ లపై జస్టిస్ కె.ఎం.జోసెఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.  'ఇది 21వ శతాబ్దం. మతం పేరుతో మనం ఎక్కడకు వెళ్తున్నాం? లౌకిక, సహనశీల సమాజంగా ఉండాలి. కానీ నేడు ద్వేషపూరిత వాతావరణం ఉంది. సామాజిక నిర్మాణం ఛిన్నాభిన్నమవుతోంది. ఇలాంటి వ్యాఖ్యలతో మనం భగవంతుణ్ణి ఎంతో తక్కువగా చేస్తున్నాం. ఇలాంటి ప్రసంగాలపై ప్రజలు ఫిర్యాదు చేశారు' అని కపిల్ సిబల్ అన్నారు. ఇలాంటి ప్రసంగాలు ఒక వైపు నుంచి మాత్రమే జరుగుతున్నాయా అని ధర్మాసనంలోని మరో సభ్యుడు జస్టిస్ హృషికేష్ రాయ్ ప్రశ్నించారు. ముస్లిం నాయకులు విద్వేషపూరిత ప్రకటనలు చేయడం లేదా? పిటిషన్ లో మీరు కేవలం ఏకపక్ష విషయాలు మాత్రమే ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. 


సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు 


 ఈ పిటిషన్ పై జస్టిస్ జోసెఫ్ తీర్పును రాశారు. "ఐపీసీలో 153 ఎ, 295 ఎ, 505 వంటి అనేక సెక్షన్లు ఉన్నాయి. కానీ పోలీసులు వాటిని ఉపయోగించకపోతే, ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారిని ఎప్పటికీ కట్టడి చేయలేరు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో జరిగిన సంఘటనలను ఈ పిటిషన్ లో ప్రస్తావించారు. ఇలాంటి కేసుల్లో వెంటనే కేసులు నమోదు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్రాలను ఆదేశిస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదుల కోసం వేచి ఉండకండి." అని జస్టిస్ జోసెఫ్ అన్నారు.  భవిష్యత్తులో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే, అది సుప్రీంకోర్టు ధిక్కారంగా పరిగణించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చేసిన అన్ని విద్వేషపూరిత ప్రకటనలపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు మూడు రాష్ట్రాలను కోరింది.