ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. విచారణ అనంతరం సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న కేసులపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, సిసోడియాపై ఉన్న కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో సీబీఐ, ఈడీలకు పలు ప్రశ్నలు సంధించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి సిసోడియా ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో వాదనలు వినింది. తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. తనపై రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా కోరారు.
వాదనలు విన్న ధర్మాసనం దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. అయితే సిసోడియాపై విచారణను ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణ ప్రక్రియ మందకొడిగా కొనసాగితే సిసోడియా మూడు నెలల్లోగా మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడు నెలల తర్వాత సిసోడియా మళ్లీ కోర్టుకు వస్తారో లేదో చూడాలి.