Lady of Justice Statue Without Blindfold | న్యూఢిల్లీ: న్యాయదేవత కళ్లకు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గంతలు తొలగాయ్. ఇప్పటివరకూ భారతదేశంలో కోర్టుల్లో ఉండే న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు కనిపించేవి. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండవు. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీం కోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహాన్ని కళ్లకు గంతలు లేకుండా ఏర్పాటు చేశారు. కళ్లకు గంతలు లేని న్యాయదేవత కొత్త ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇప్పటివరకూ ఓ లెక్క, ఇకనుంచి న్యాయ వ్యవస్థలో మరో లెక్క అని అంటున్నారు.
న్యాయదేవత విగ్రహంలో ఈ మార్పులు గమనించారా?
ఇప్పటివరకూ కోర్టుల్లో ఉంటే న్యాయదేవత విగ్రహానికి కళ్లకు గంతలు ఉండేవి. ఇకపై కళ్లకు గంతలు లేకుండా న్యాయ దేవత విగ్రహాలు మనకు దర్శనమివ్వనున్నాయి. న్యాయ దేవత పాత విగ్రహాలలో ఆమె కుడి చేతిలో త్రాసు ఉంటే, ఎడమ చేతిలో పొడవైన కత్తి ఉండేది. కాగా, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన న్యాయదేవత కొత్త విగ్రహం ఎడమ చేతిలో రాజ్యాంగం ఏర్పాటు చేశారు. అంటే రాజ్యాంగం ప్రకారం అందరికీ సమ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు సూచించినట్లు అంతా భావిస్తున్నారు.
సుప్రీంకోర్టులో తాజాగా ఏర్పాటు చేసిన కళ్లకు గంతలు లేని న్యాయదేవత విగ్రహం హాట్ టాపిక్ అవుతోంది. సుప్రీంకోర్టులోని జడ్జీల లైబ్రరీలో కొత్త న్యాయ దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చట్టానికి కళ్లు లేవు అని, అందుకు న్యాయదేవత కళ్లకు ఉన్న గంతలే నిదర్శనం అని కొన్ని సినిమాల్లో హీరోలు, లాయర్ల డైలాగులు పదే పదే విని ఉంటాం. అయితే ఇకనుంచి న్యాయదేవతకు కళ్లు లేవు, గుడ్డిది లాంటి మాటలు వినపడే అవకాశం లేదు. సంపద, అధికారాన్ని బట్టి బట్టి చట్టాలు, తీర్పులు ఉండవని.. న్యాయదేవతకు అంతా సమానమేనని పాత విగ్రహం ఉద్దేశం. అయితే సీజేఐ చంద్రచూడ్ సహా ధర్మాసనం మార్పును స్వాగతించింది. బ్రిటీష్ కాలంలో తెచ్చిన వ్యవస్థ, విగ్రహాలలో ప్రస్తుత రోజులకు తగినట్లు మార్పు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: New Criminal Laws: 60 రోజుల్లోగా బాధితులకు న్యాయం, కొత్త క్రిమినల్ చట్టాలతో వచ్చే మార్పులివే!
ఇటీవల భారత న్యాయ సంహిత చట్టాలను ప్రవేశపెట్టారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం ఇతర మౌలిక సూత్రాలను న్యాయ దేవత అందరికీ ఒకే విధంగా అందిస్తుందని చెప్పడమే కళ్లకు గంతలు లేని న్యాయదేవత విగ్రహం సూచిస్తుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. రాజ్యాంగాన్ని అనుసరించి, తగిన రీతిలో శిక్షలు ఉండనున్నాయి. ఇన్నాళ్లు ఉంచిన కళ్లకు గంతల విగ్రహం తప్పు చేసిన వారిని శిక్షిస్తుందని సూచించేది. కానీ తాజాగా కళ్లకు గంతలు తొలగించి, మరో చేతిలో రాజ్యాంగం ఉంచి న్యాయ దేవత విగ్రహాన్ని, న్యాయానికి సరికొత్త అర్థం చెబుతున్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను మరింత సమర్థవంతంగా పరిరక్షిస్తూ, అందరికీ ఒకే రకమైన చట్టాలను అమలు చేస్తున్నట్లు అర్థం వచ్చేలా కొత్త విగ్రహం ఉందని వినిపిస్తోంది.