Operation Kaveri Sudan Crisis: యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ సూడాన్‌లో చిక్కుకుపోయిన భార‌త‌ పౌరులను రక్షించేందుకు ఆపరేషన్ కావేరీని ప్రారంభించిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం తెలిపారు. "సూడాన్‌లో ఉన్న‌ మా సోదరులందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని జైశంకర్ అన్నారు. "సూడాన్‌లో చిక్కుకుపోయిన మన పౌరులను తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ కావేరీ కొన‌సాగుతోంది. సుమారు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్‌కు చేరుకున్నారు. మరికొంద‌రు మార్గ‌మ‌ధ్యంలో ఉన్నారు. మా నౌకలు, విమానాలు వారిని స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి" అని జైశంకర్ ట్వీట్ చేశారు.






సూడాన్ నుంచి భారతీయులను తరలించేందుకు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)  ఆదివారం  అత్యవసర ప్రణాళికలు రూపొందించింది. అయితే క్షేత్ర‌స్థాయిలో తీసుకునే చర్యలు భద్రతా పరిస్థితిపై ఆధారపడి ఉంటాయ‌ని పేర్కొంది.


ఆ దేశ రాజధాని ఖార్టూమ్‌లోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర పోరాటాలు జరుగుతున్నట్టు నివేదికలు వచ్చాయ‌ని, సూడాన్‌లో భద్రతా పరిస్థితి "అస్థిరంగా" ఉందని పేర్కొంది. ప్రస్తుతం సూడాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న‌ 3,000 మందికి పైగా భారతీయ పౌరుల భద్రతపై దృష్టి సారించినట్లు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.


"మా సన్నాహాల్లో భాగంగా వేగంగా ముందుకు సాగడానికి, భారత ప్రభుత్వం అనేక ప్ర‌ణాళిక‌ల‌ను అనుసరిస్తోంది" అని విదేశీ వ్య‌వ‌హారాల‌ మంత్రిత్వ శాఖ‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. "రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130J విమాన‌లు ప్రస్తుతం జెడ్డాలో అందుబాటులో ఉన్నాయి. INS సుమేధ సూడాన్ పోర్ట్‌కు చేరుకుంది" అని తెలిపింది.


"ఆకస్మిక ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, అయితే క్షేత్ర‌స్థాయిలో స‌హాయ‌చ‌ర్య‌లు అక్క‌డి భద్రతా పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి, ఇది ఖార్టూమ్‌లోని వివిధ ప్రదేశాలలో భీకర పోరాటాల నివేదికల నేప‌థ్యంలో అస్థిరంగా కొనసాగుతుంది" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.


సైన్యం, పారామిలిటరీ గ్రూపు మధ్య భీకర పోరు 
సూడాన్‌లో గత 10 రోజులుగా దేశ సైన్యం.. పారామిలిటరీ గ్రూపు మధ్య భీకర పోరు కొన‌సాగుతోంది. ఫ‌లితంగా ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 400 మంది పౌరులు మరణించారు. ఈ నేప‌థ్యంలో సూడాన్‌లో ఉన్న‌ భారతీయుల శ్రేయస్సు, భద్రతకు హామీ ఇవ్వడానికి భారతదేశం పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తోందని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ పేర్కొంది. సుడాన్‌లో భ‌ద్ర‌తా ప‌రిస్థితిని సంక్లిష్టత‌ను నిశితంగా పరిశీలిస్తున్నామ‌ని తెలిపింది. సుడాన్‌లోని భారతీయుల ర‌క్ష‌ణ‌కు వివిధ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటున్నామ‌ని వివ‌రించింది.


విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌, సుడాన్‌లోని భారత రాయబార కార్యాలయం.. ఆ దేశ‌ అధికారులతో పాటు, ఐక్యరాజ్యసమితి, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ స‌హా ఇతరులతో తరచూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. 


ఫ్రెంచ్ వైమానిక దళం ఇప్పటివరకు ఐదుగురు భారతీయ పౌరులను తరలించినట్లు ఫ్రెంచ్ దౌత్య వర్గాలు తెలిపాయి. వీరితో పాటు 28కి పైగా దేశాల పౌరుల‌ను జిబౌటిలోని ఫ్రెంచ్ సైనిక స్థావరానికి తీసుకువచ్చారు. అంతకుముందు సౌదీ అరేబియా త‌మ‌తో సన్నిహిత సంబంధాలు, స్నేహపూర్వకంగా ఉండే దేశాలకు చెందిన 66 మంది పౌరులను సుడాన్ నుంచి ఆదివారం సురక్షితంగా తరలించింది. వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు.