Opposition Unity:


నితీష్‌తో భేటీ 


బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్న తరుణంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయిన నితీష్...ఈ సారి మమతాతో చర్చించారు. లఖ్‌నవూలో అఖిలేష్ యాదవ్‌తోనూ ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. విభేదాలన్నీ పక్కన పెట్టి 2024 ఎన్నికల్లో విపక్షాలన్నీ ఒక్కటిగా బీజేపీపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు దీదీ. ఇందులో భాగంగానే గత నెల కోల్‌కత్తాలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. ఇప్పుడు నితీష్‌ కుమార్‌తో పాటు తేజస్వీ యాదవ్‌తోనూ కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశం తరవాత మమతా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలతో కూటమి కట్టేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వర్సెస్ బీజేపీ పోరాటం జరగనుందని తేల్చి చెప్పారు. సైద్ధాంతికంగా ఒకే విధంగా ఆలోచించే పార్టీలతో కలవడానికి ఎలాంటి అభ్యంతరాలూ లేవని తెలిపారు. 


"నేను నితీష్‌తో ఒకే విషయం చెప్పాను. బిహార్‌ గతంలో కీలక ఉద్యమాలకు వేదికగా నిలిచింది. మనం కూడా అక్కడి నుంచే పోరాటం మొదలు పెట్టాలని సూచించాను. కానీ అంత కన్నా ముందు మేమంతా ఒక్కటే అన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పాను. బీజేపీని "జీరో" చేయడమే నా లక్ష్యం. అబద్ధాలు, మీడియా సపోర్ట్‌తో వాళ్లు హీరోలైపోయారు"


- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం






ఈ భేటీపై నితీష్ కుమార్ కూడా స్పందించారు. అందరి విజన్ ఒక్కటే అయినప్పుడు విపక్షాలు ఒక్కటి కావడం పెద్ద కష్టమేమీ కాదని తేల్చి చెప్పారు. బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. 


"ఆలోచనలు, విజన్, మిషన్...ఇవన్నీ ఒక్కటే అయినప్పుడు విపక్షాలు ఒక్కటవడం కష్టమేం కాదు. మమతాతో కీలక అంశాలు చర్చించాను. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదు. వాళ్లకు తెలిసిందల్లా పబ్లిసిటీ మాత్రమే"


- నితీష్ కుమార్ యాదవ్, బిహార్ సీఎం