Indian Wrestlers Protest:
కొనసాగుతున్న ఆందోళన
ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ రెజ్లర్లు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నిరసన కొనసాగుతోంది. రాత్రి పూట కూడా అక్కడే ఉన్నారు రెజ్లర్లు. బ్రిజ్ భూషణ్‌పై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇంకా ఆయనపై కేసు నమోదు చేయకపోవడంపై మండి పడుతున్నారు. ఇప్పటి వరకూ పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు రెజ్లర్లు. బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రెజ్లర్ల తరపున న్యాయవాదులు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని పిటిషన్ వేశారు. అయితే...ఆదివారం కావడం వల్ల ఇప్పటి వరకూ ఆ పిటిషన్ నమోదైనట్టు అధికారికంగా గుర్తించలేదు. పిటిషన్ నంబర్ కూడా జనరేట్ కాలేదు. పిటిషన్‌ల లిస్ట్‌లో చోటు దక్కితే కానీ సుప్రీం కోర్టు దీనిపై విచారణ చేపట్టేందుకు అవకాశముండదు. ప్రస్తుతానికైతే లాయర్లు ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలు ఇవ్వడం లేదు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసేలా చొరవ చూపే విధంగా పోరాటం చేస్తున్నారు.