DRDO : రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ తొలి విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది. దీంతో మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా డీఆర్డీవో గొప్ప విజయం సాధించింది. ఈ తొలి విమానాన్ని డీఆర్డీవో కర్ణాటకలోని చిత్రదుర్గ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.
ఇది మానవ రహిత గగనతల విమానం ( UAC). ఇందుకు సంబంధించిన వివరాలను డీఆర్డీవో వెల్లడించింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన దిశగా ఇది ఒక ముఖ్యమైన దశ అని డీఆర్డీవో పేర్కొంది. ఈ మానవ రహిత గగనతల విమానాన్ని డీఆర్డీవో పరిశోధనా ప్రయోగశాలల్లో ఒకటైన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ( ADE ) రూపొందించింది. ఏడీఈ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ యూఏవీ ఒక చిన్న టర్బోఫ్యాన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా తనంతట తాను పని చేస్తుంది. టేకాఫ్ నుంచి వే పాయింట్ నేవిగేషన్, ల్యాండింగ్ వరకు కచ్చితమైన పనితీరును ప్రదర్శించిందని డీఆర్డీవో తెలిపింది. భవిష్యత్తులో మానవ రహిత విమానాల అభివృద్ధికి ఈ పరీక్ష గొప్ప మైలురాయి లాంటిదని పేర్కొంది.డీఆర్డీవో శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.
ఈ ప్రయోగంతో భారత్ యుద్ధ విమానాలవిషయంలోనూ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గిపోతుందని భావిస్తున్నారు. ఇప్పటికే డీఆర్డీవో భారత రక్షణ రంగ అవసరాలు తీర్చడానికి ఎన్నో రకాల పరిశోధనలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. ఈ క్రమంలో యుద్ధ విమానాల దిశగా ముందడుగు వేయడం రక్షణ రంగ నిపుణుల్ని సంతృప్తి పరుస్తోంది.