Viral Video: మిరపకాయ బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు, ఆనియన్ బజ్జీ, అరటికాయ బజ్జీలు, తమలపాకుల గురించి మనం విన్నాం తిన్నాం. ఆనియన్ పకోడీ, చికెన్ పకోడీ, పాలక్ పకోడీ, ఆఖరుకి క్యాలీఫ్లవర్‌తో పకోడి చేయడం చూశాం. మీరెప్పుడైనా గులాబీల పకోడీ తిన్నారా, కనీసం విన్నారా.. పెట్టుకునే పువ్వులతో పకోడీ ఏమిటా అని ఆశ్చర్యపోకండీ.. నిజమేనండీ బాబూ.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు తెలియలేదు కానీ, చూస్తుంటే మాత్రం నార్త్ ఇండియాలా అనిపిస్తుంది.
ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి
తయారీ విధానం ఇలా
ఇక్కడ ఓ వ్యక్తి బొకే కోసం తెచ్చిన గులాబీ గుత్తిని తీసుకుని వాటికున్న కాడలు కత్తిరించి పూలు మాత్రం ఉంచాడు. శనగపిండిలో కలిపి పట్టుకుని నూనెలో వేసుకునేందుకు వీలుగా మిరపకాయకు ఉన్నట్టు చిన్న తొడిమ ఉండేలా కట్ చేసి పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్క గులాబీ పూలను శనగపిండిలో ముంచి బాగా కలిపి అచ్చం మిరపకాయ బజ్జీలు వేసినట్టుగానే సలసలా కాగే నూనెలో వేయించి బయటకు తీశాడు. వినడానికి చాలా వింతగా ఉంది కదూ. తింటే ఇంకెంత కష్టంగా ఉంటుందో మరి. కానీ ఇక్కడ వంటవాడు తీసి వడ్డించడం ఆలస్యం కస్టమర్లు ఆవురావురుమంటూ తెగ లాగించేస్తున్నారు. గులాబీ రేకులను రంగు, వాసన కోసం సుగంధ పరిమళాలు వెదజల్లే కొన్ని రకాల క్రీములు, స్ప్రేలు లాంటి సౌందర్యసాధనాల్లో వాడటం తెలుసు. నేరుగా తింటే కూడా ఎర్రగా గులాబీ రంగులోకి మారిపోవచ్చని కాబోలు ఈ వింత వంటకం తయారు చేస్తున్నారనుకుంటా.
వీడియో చూసిన వాళ్లకు ఆశ్చర్యం
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కాదేదీ పకోడీకి అనర్హం అని కామెంట్లు చేస్తున్నారు. జల్సా సినిమాలోనూ ఒక సీన్ లో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ గులాబీ పూలు తింటుంటే ఎవరైనా పూలు తింటారా అంటే క్యాలీ ప్లవర్ తింటాం కదా అలాగే ఇది అంటుంది.. ఈ వంట మాస్టర్ కూడా ఈ జల్సా సినిమానే చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో అనిపిస్తుంది.
కొందరేమో బాబోయ్ ఇది కచ్చితంగా ఉత్తర భారతదేశం వంటకం అయ్యుంటుంది. అటువైపు తయారు చేసే వింతరకపు వంటలు తినలేంరా నాయనా అని నోరు కరుచుకుంటున్నారు. కొంతమంది రకరకాల ఎమోజీలతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వీటిని తింటే ఆరోగ్యం సంగతి ఏమవుతుందో తెలియదు కానీ, చూసినోళ్లు మాత్రం ఇదెక్కడి చోద్యంరా బాబూ అని నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసి మీకూ ట్రై చేయాలనిపిస్తే వైద్యుల సలహాతో ముందుకెళ్లండి. నిపుణుల స్వీయ పర్యవేక్షణలో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఉత్తమమని కొందరు నెటిజన్లు ఉచితంగా సలహా ఇస్తున్నారు. సో.. మీ ఇష్టం మరి.
Also Read: మనవడిని స్వయంగా స్కూల్‌కు తీసుకువెళ్లిన రజనీ - బెస్ట్ గ్రాండ్‌ఫాదర్ అంటూ మురిసిపోయిన కూతురు
Also Read: హెచ్డీఎఫ్సీ బ్యాంకు సొమ్ము రూ.2.5 కోట్లతో ఉద్యోగి పరార్