Man Escaped with Bank Money:  రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హిటాచి సంస్థకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగి తన చేతివాటం ప్రదర్శించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్‌ చేయాల్సిన  రెండున్నర కోట్ల రూపాయలతో ఉడాయించారు. పరారైన వ్యక్తిని అశోక్ కుమార్ గా గుర్తించారు.  హిటాచి సంస్థ ఉద్యోగులను దారి మళ్లించి డబ్బులు ఎత్తుకెళ్లారు. దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి హిటాచి ఏజెన్సీ ఉద్యోగి డబ్బులు డ్రా చేశాడు. ఏటీఎంలో నింపాల్సిన సమయంలో సుమారు 2.4కోట్ల రూపాయలతో అశోక్ పరారయ్యాడు. దీంతో రాజమండ్రి పోలీసులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా హిటాచి మేనేజ్ మెంట్ సంస్థలో అశోక్ క్యాష్ ఫిల్లింగ్ బాయ్‌గా పని చేస్తున్నట్లు హిటాచి సంస్థకు చెందిన కొందరు చెబుతున్నారు.   మొత్తం 19 ఏటీఎంలలో డబ్బులు ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా అశోక్ ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు  ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


పోలీసుల హెచ్చరిక
 ‘‘ఈ ఫోటోలోని వ్యక్తి రాజమహేంద్రవరం పట్టణం, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు సాయంత్రం ఏటీఎంలలో రెండున్నర కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్ చేస్తానని  ఆ డబ్బుతో పారిపోయాడు. దయచేసి సంబంధిత టోల్ గేట్ల వద్ద వెరిఫై చేయించండి. అలాగే చెక్ చేయించగలరు. ధన్యవాదాలు.’’ అంటూ పోలీసులు ప్రకటన జారీ చేశారు. అశోక్‌కుమార్‌పై ఫిర్యాదు చేసిన 'ఇటాచి ప్రైవేట్‌ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం పై కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు.


గతంలో కూడా ఇలాగే
గతంలో కూడా ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన రూ.1.5కోట్ల నగదుతో ఓ వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు.సెక్యూర్‌వెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‍కు చెందిన వ్యాన్‍ డ్రైవర్ ఏటీఎంలో నింపాల్సిన ఐసీఐసీఐ బ్యాంకు డబ్బుతో ఉడాయించాడు. వ్యాన్‍తో పాటు డబ్బును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రం పాట్నాలోని ఆలమ్‍గంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జహనాబాద్ జిల్లా గోషి గ్రామానికి చెందిన సూరజ్ కుమార్‌ ఐసీఐసీఐ బ్యాంక్‍కు చెందిన రూ.1.5కోట్ల డబ్బు ఉన్న ఏజెన్సీ వ్యాన్‍ను తీసుకెళ్లాడు. ఆలమ్‍గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఏటీఎంలో నగదును నింపేందుకు వ్యాన్‍ను పార్క్ చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది.