newly elected Wrestling Federation suspends : భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation  Of India )పై వివాదం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఎన్నికైన  భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌ను కేంద్ర ప్రభుత్వం (Central Government) సస్పెండ్ (Suspend) చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ, క్రీడా శాఖ నిబంధనలకు విరుద్ధంగా పోటీల నిర్వహణకు కొత్త అధ్యక్షుడు (President) సంజయ్ సింగ్ (Sanjay Singh) సిద్ధమయ్యారు. అండర్‌-15, అండర్‌-20 జాతీయ రెజ్లింగ్‌ పోటీలు నిర్వహించాలని ప్రకటన కూడా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నందినీ నగర్‌, గోండాలో  ఈ నెలాఖరులోపు నిర్వహిస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా ప్రకటించడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా సంజయ్ సింగ్ ప్రకటన చేయడంతో కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. క్రీడా  శాఖ రూల్స్ ను  అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.  


మళ్లీ  బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకేనా ?
భారత రెజ్లింగ్ సమాఖ్యపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. నెలల తరబడి రెజ్లర్ల ధర్నాలు ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు చేశారు. దీంతో కొంత కాలం పాటు భారత రెజ్లింగ్  సమాఖ్య అధ్యక్ష ఎన్నికలు ఆగిపోయాయి. బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో తాజాగా ఎన్నికలు జరిగాయి. ఈ నెల 21న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ రాజీనామాతో ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సంజయ్  సింగ్, తన ప్రత్యర్థి అనితా షెరాన్ పై 40 ఓట్ల తేడాతో గెలుపొందారు. సీడబ్ల్యూజీ గోల్డ్ మెడలిస్ట్ ప్యానెల్ సెక్రటరీ జనరల్ పదవిని దక్కించుకుంది. మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు. ఇప్పుడు సంజయ్‌ సింగ్ రూపంలో మళ్లీ డబ్ల్యూఎఫ్‌ఐ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకే వెళ్లిపోయిందని రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఎన్నికను వ్యతిరేకిస్తున్న రెజ్లర్లు
రెండు రోజుల క్రితం నిర్వహించిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్‌ సింగ్ ఎన్నికను కొందరు రెజ్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత స్టార్‌ రెజ్లర్లు సాక్షి మాలిక్‌, భజ్ రంగ్ పూనియాపాటు మరి కొందరు వ్యతిరేకించారు. సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా రెజ్లింగ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు సాక్షి మాలిక్ ప్రకటించారు. అటు బజరంగ్‌ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేశాడు. పద్మశ్రీ పురస్కారాన్ని బజ్‌రంగ్‌ పునియా వెనక్కి ఇచ్చేయడంపై మాట్లాడటానికి క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నిరాకరించారు. బధిరుల ఒలింపిక్స్‌ గోల్డ్ మెడల్ సాధించిన వీరేందర్‌ సింగ్‌ యాదవ్‌ కూడా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలోనే కొత్తగా ఎన్నికైన ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్‌ చేయడం చర్చనీయాంశమైంది.