Mysore News | పూర్వకాలంలో మైసూర్ మహారాణులు వాడిన పర్సనల్ ట్రైన్ చూస్తే వారెవ్వా అనిపించక మానదు. 1899లో రోజ్ వుడ్ తో ఇంగ్లాండ్లో తయారైన ఈ ట్రైన్ ప్రస్తుతం మైసూర్ లోని రైల్వే మ్యూజియంలో భద్రపరిచారు. మైసూర్ ను పరిపాలించిన  24 వ వడయార్ మహారాజు 4వ కృష్ణరాజు వడయార్  భార్య కోసం ఈ ట్రైన్ ను తయారు చేయించారు. ఈ ట్రైన్ లో ఒక బోగీ మొత్తం మహారాణి కోసం ప్రత్యేకంగా రెడీ చేస్తే మరొక బోగీలో వంటవాడు, రాణి గారి అసిస్టెంట్స్ ఉండేవారు. ఈ ట్రైన్ లో  మహారాణి సింహాసనంతో పాటు, డైనింగ్ హాల్, పూజ గది, బెడ్ రూమ్, స్నానాల గది, స్టోర్ రూమ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. రాజు వంశీకులకు చెందిన మైసూర్ స్టేట్ రైల్వే ఆధ్వర్యంలో ఈ ట్రైన్ నడిచేది. ప్రస్తుతం మైసూర్ రైల్వే మ్యూజియానికి ఈ ట్రైన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.


రెండు బోగీ ట్రైన్.. రైల్లోనే సింహాసనం.. బెడ్ రూమ్...!
1902 నుండి 1940 నుండి వరకూ మైసూర్ ను పరిపాలించిన 4వ కృష్ణ రాజ వడయార్ చాలా ఆధునిక భావాలు ఉన్న మహారాజు. ఆయన పరిపాలనలోనే ఆసియా మొత్తం మీద ఎలక్ట్రిక్ వీధి దీపాలు మొట్టమొదటిసారిగా బెంగళూరులో వెలిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, మింటో ఐ హాస్పిటల్ సహా ఎన్నో డ్యాములు, అగ్రికల్చరల్ ప్రాజెక్టులు నెలకొల్ప బడ్డాయి.  బెనారస్ హిందూ యూనివర్సిటీకి మొదటి ఛాన్స్ లర్ కూడా ఆయనే. ఇక మైసూర్ లో బాల్య వివాహాలను రద్దు చేసిన కృష్ణరాజు వడయార్ బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించారు. అలాగే వితంతు మహిళలకు విద్య, పెన్షన్ సౌకర్యాలు ప్రవేశపెట్టారు.


ఆయనకు గుజరాత్ కు చెందిన కతియావార్ యువరాణి ప్రతాప కుమారి దేవితో వివాహమైంది. భార్య అంటే విపరీతమైన ప్రేమ ఉన్న కృష్ణరాజ వాడయర్ ఆమె కోసం ప్రత్యేకంగా రోజ్ వుడ్ తో తయారైన ఈ ట్రైన్ ను ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ లో కొన్ని  మైసూర్ కు రప్పించారు. ఈ ట్రైన్ లోని ఒక భోగి మొత్తం మహారాణికి మాత్రమే  కేటాయించబడింది. దానిలోనే ఆమె కోసం ప్రత్యేక సింహాసనం, ఒక బెడ్, రాసుకోవడానికి రైటింగ్ టేబుల్, ప్రత్యేకమైన స్నానాల గది, డైనింగ్ హాల్, వేడి నీళ్ల కోసం బాయిలర్ రూమ్  వాటి సౌకర్యాలు ఉన్నాయి. మరొక బోగీలో  ఆమె అసిస్టెంట్లు, వంటవాడు, కిచెన్ రూమ్, అసిస్టెంట్ ల కోసం బాత్ రూమ్, బెడ్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో  ధనిక మహారాజులు తమ తమ రాజ్యాల్లో ప్రత్యేకమైన రైల్వే నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. నిజాం స్టేట్ రైల్వే, బరోడా స్టేట్ రైల్వే, మైసూర్ స్టేట్ రైల్వే  లాంటివి వీటిలో భాగమే.  ఢిల్లీలోని బ్రిటిష్ వైస్రాయ్ తో సమావేశాలు, విందుల్లాంటివి జరిగినప్పుడు ఈ రైల్వేలను వాళ్లు వాడేవారు.



మధ్యయుగాల నుంచి ఆధునిక యుగంలో ప్రవేశిస్తున్న  కాలం కావడంతో అప్పట్లో రాజు వంశీయులు కూడా అధునిక భావాలు కలిగి ఉండేవారు. దానిలో మైసూర్ సంస్థానం ముందు వరుసలో ఉండేది. పట్టపు రాణి లను  కూడా అంతపురం నుండి  ప్రజల్లోకి వెళ్ళనిచ్చేవారు. ఇదిగో అలాంటి సందర్భాల్లోనే  మైసూర్ మహారాణి ఈ ట్రైన్ ని ఉపయోగించేవారు.


ప్రస్తుతం మైసూర్ రైల్వే మ్యూజియంలో ఉన్న మహారాణి ట్రైన్ 


స్వాతంత్రం వచ్చాక 1979 లో ఇండియన్ రైల్వే పాతకాలపు అరుదైన రైల్వే ఇంజన్లతో మైసూర్ రైల్ మ్యూజియం ను  ఏర్పాటు చేసింది. ఇందులో మైసూర్ స్టేట్ రైల్వే వాడిన చాలా రైల్ ఇంజన్ లు, పరికరాలు ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంకు మైసూర్ రాజకుటుంబం  తమ మహారాణులు వాడిన అరుదైన ట్రైన్ ను కూడా బహూకరించింది. మైసూర్ రైల్వే స్టేషన్ను ఆనుకుని  ఉన్న ఈ రైల్ మ్యూజియంలో  స్పెషల్ ఎట్రాక్షన్ ఈ "మహారాణి  ట్రైన్". ఈ మ్యూజియం ఎంట్రీ ఫీజ్ పెద్దలకు 50, పిల్లలకు 20 రూపాయలు.


Also Read: Mysore Pak History: మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ - దీని చరిత్ర తెలుసా!