Bus Accident In Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్చుల సమీపంలో ప్రయాణీకుల బస్సు కాలువలో పడింది. బస్సు ప్రమాదంలో మొత్తం 45 మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. అందులో 28 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ విభాగం ధృవీకరించింది. గాయపడిన 20 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


ప్రమాదం తర్వాత ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌కు సహాయక బృందాలు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మూడు జిల్లాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 6 SDRF బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మృతులు ఐదుగురే అనుకున్నారు. సహాయక చర్యలు పూర్తి అయ్యేసరికి మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతి కష్టమ్మీద బయటకు తీశారు. 


ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి 


ప్రమాదంపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్మోరా జిల్లా మార్చులాలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. ఘటన స్థలంలో స్థానిక అధికారులతోపాటు SDRF బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు.  క్షతగాత్రులు తరలించడానికి, చికిత్స కోసం సమీప ఆసుపత్రులు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. అవసరమైతే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని సూచనలు చేశారు.




ARTOను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు.