Actress Kasturi Controversial Comments: తెలుగు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కస్తూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగు వాళ్లు తమిళనాడు వచ్చారని అన్నారు. అలాంటి వాళ్లు తాము కూడా తమిళ జాతి అంటున్నారని కామెంట్స్ చేశారు. ఇది వివాదాస్పదం కావడంతో తాను ఆ ఉద్దేశంతో అనలేదని... తన కామెంట్స్ వక్రీకరించారంటూ చెప్పుకొచ్చారు.
తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నటి, బీజేపీ లీడర్ కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. స్థానికంగా నిర్వహించిన ఓ బ్రాహ‌్మణ సంఘాల సమ్మేళనంలోపాల్గొన్న ఈమె తెలుగు వారిని హేళన చేసేలా కామెంట్స్ చేశారు. తమిళనాడులోని అంతఃపురంలో మహిళలకు సేవలు చేసేందుకు తెలుగు వారు వచ్చారని అన్నారు. వారు ఇప్పుడు తమది కూడా తమిళ జాతి అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 300 ఏళ్ల క్రితం సేవ చేసేందుకు వచ్చిన వారే తమిళలు అయినప్పుడు ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు తమిళలుకారని ప్రశ్నించారు. తెలుగు మాట్లాడే వాళ్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.
అలాంటి తెలుగు వారికి ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రివర్గంలో స్థానం ఉందన్నారు కస్తూరి. ఐదుగురు తెలుగు మూలాలు ఉన్న వాళ్లు మంత్రులుగా ఉన్నారని వివరించారు. బ్రాహ్మణులు చెప్పే మంచి మాటల వల్లే సమ్యసలు వస్తున్నాయన్నారు. ఇతరుల ఆస్తులను లాక్కోవద్దని, మహిళలపై మోజుపడొద్దని ఒకరి కంటే ఎక్కువ భార్యలు ఉండొద్దన్నందుకు బ్రాహ్మణులపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదం కావడంతో సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. తమిళనాడులోని ఓ ఛానల్‌ను ట్యాగ్ చేస్తూ... ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అసలు విషయాన్ని ట్విస్ట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొన్ని ఏళ్ల క్రితం తమిళనాడు వచ్చిన తెలుగు వారు తాము తమిళులమని చెప్పుకుంటున్నారని కానీ బ్రాహ్మణులను మాత్రం కాదంటున్నారని అన్నారు.
కస్తూరీ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి కామెంట్స్ వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి.