ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి భారత్‌లో ఒకటే టెన్షన్. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ బిడ్డలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు కంగారు పడిపోతున్నారు. అటు ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను తరలించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఆ దిశగా చర్యలు చేపట్టింది.
సరిహద్దులు దాటించి...
ఉక్రెయిన్‌లో నేరుగా విమానాలు దిగే ఛాన్స్ లేనందున సమీప దేశాల నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రైవేట్ వెహికల్స్ బుక్క్ చేసుకొని ఉక్రెయిన్ సరిహద్దు దాటి వచ్చేయాలని విద్యార్థులకు రూట్ మ్యాప్ ఇచ్చింది. విద్యార్థులు వెళ్లే వెహికల్స్‌కు ఇండియా జెండా పెట్టుకోవాలని సూచించింది.
ఎయిరిండియా ప్రత్యేక విమానం
ఉక్రెయిన్ సరిహద్దు దాటి వచ్చిన విద్యార్థుల కోసం రొమేనియా, హంగేరిలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. భారతీయుల తరలింపు కోసం ఎయిర్ ఇండియా AI-1943 ప్రత్యేక విమానం రొమేనియాలోని బుకారెస్ట్‌లో ల్యాండ్ అయింది.ఈ ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయం నుంచి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది. .
AI-1943 అనే విమానం ముంబై విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 3.40 గంటలకు బయలుదేరింది. ఇండియన్ టైం ప్రకారం పది గంటలకు బుకారెస్ట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
ఉక్రెయిన్- రొమేనియాకు భారత్ విద్యార్థులు
భారతీయ విద్యార్థులను సరిహద్దులకు చేరుకోమని కోరిన తర్వాత, ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న జాతీయులను భారత ప్రభుత్వ అధికారులు బుకారెస్ట్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో స్వస్థలాలకు చేరుస్తారని అధికారులు తెలియజేసినట్లు PTI తెలిపింది.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం బుకారెస్ట్, హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్‌కు మరిన్ని ఎయిర్ ఇండియా విమానాలు నడపనుంది ప్రభుత్వం.
రష్యాతో వివాదం కారణంగా తమ గగనతలంలో విమానాలు ఎగరడాన్ని ఉక్రెయిన్ పూర్తిగా నిషేధించింది. అందుకే విద్యార్థుల తరలింపులో జాప్యం జరిగింది. విద్యార్థులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి పెరిగిపోవడంతో ప్రభుత్వం ప్రత్నామ్నాయ ఏర్పాట్లను పూర్తి చేశారు. బుకారెస్ట్, బుడాపెస్ట్ వరకు విద్యార్థులను తీసుకురావాలని ఎంబసీ అధికారులకు సూచించింది. దాదాపు 20,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు, ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని అధికారులు గుర్తించారు.
ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడానికి ముందే, ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 22న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు విమానం పంపించింది. 240 మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది.
దిల్లీ, ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్స్
తర్వాత పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. భారతీయ పౌరులను తరలించడానికి ప్రత్యేక ప్రభుత్వ చార్టర్ విమానాలు నడపనున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొంది. దిల్లీ, ముంబై నుంచి బుకారెస్ట్, బుడాపెస్ట్‌కు B787 విమానాలను నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
ప్రస్తుతం ఉజ్హోరోడ్ సమీపంలోని చాప్-జహోనీ హంగేరియన్ సరిహద్దు, చెర్నివ్ట్సీ సమీపంలోని పోరుబ్నే-సిరెట్ రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్లు ఉన్నాయి. అక్కడ వెరిఫై చేసి ఆయా దేశాల్లోకి పంపిస్తారు.
జెండా, పాస్‌పోర్ట్ తప్పనిసరి
భారతీయ ప్రయాణికులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు, ఇతర అవసరమైన వస్తువులు, కోవిడ్ -19 టీకా ధృవీకరణ పత్రాలను సరిహద్దు చెక్‌పోస్టులకు తీసుకెళ్లాలని విదేశాంగ శాఖ సూచించింది. వాహనాలు, బస్సులపై భారత జెండా అతికించాలని తెలిపింది.
కీవ్ , రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 600 కి.మీ . రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ఎనిమిదిన్నర గంటల నుంచి 11 గంటల సమయం పడుతుంది.
బుకారెస్ట్ రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పడుతుంది.
కీవ్, హంగేరియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 820 కిలోమీటర్లు ఉంది. దానిని రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే 12-13 గంటలు పడుతుంది.