Chandrayaan 3 Landing: ఇప్పుడు అందరి దృష్టి చంద్రుడి దక్షిణ ధృవంపైనే ఉంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు కేవలం చంద్రుడిపై ప్రయోగాలు చేశాయి. కానీ దక్షిణ దృవంపై అడుగుపెట్టలేదు. ఇండియా చంద్రయాన్ ప్రయోగంతో ఇప్పుడు చంద్రుడి దక్షిణ ధృవంపై అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. భారత్ బాటలోనే యునైటెడ్ స్టేట్స్, చైనా రెండూ దక్షిణ ధృవానికి మిషన్లను ప్లాన్ చేశాయి.


ఇటీవల చంద్రుడి దక్షిణ దృవంపైకి రష్యా లూనా 25ను ప్రయోగించింది. అయితే అది క్రాస్ ల్యాండింగ్ జరిగి ఫెయిల్ అయ్యింది. భారతదేశ అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువంపై మొదటి సారిగా అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది విజయవంతం అయితే భారతదేశ అంతరిక్ష ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలదని అందరు భావిస్తున్నారు. చంద్రునిపై అత్యంత విలువైన వనరులలో ఒకటైన నీటి మంచు గురించి  తెలుసుకోవడానికి ఈ ప్రయోగం కీలకం కానుంది. 


చంద్రునిపై ఘనీభవించిన నీటి ఉనికి దక్షిణ ధృవంపై ఉన్నట్లు తెలియడంతో అక్కడ చంద్రుని కాలనీ, మైనింగ్, అంగారక గ్రహానికి మిషన్‌లకు కీలకంగా మారుతుందని అంతరిక్ష సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు భావిస్తున్నాయి.


శాస్త్రవేత్తలు చంద్రునిపై నీటిని ఎలా కనుగొన్నారు?
1960వ దశకంలోనే, మొదటి అపోలో ల్యాండింగ్‌కు ముందు, చంద్రునిపై నీరు ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఊహించారు. 1960 చివర, 1970 ప్రారంభంలో అపోలో సిబ్బంది అక్కడ లభించిన పొడి మట్టి నమూనాలను ప్రయోగాల కోసం తీసుకొచ్చారు. 


2008లో, బ్రౌన్ యూనివర్శిటీ పరిశోధకులు కొత్త సాంకేతికతతో ఆ చంద్ర నమూనాలను పరిశీలించారు. అందులో అగ్నిపర్వత శిథిలాల్లోని చిన్న పూసల లోపల హైడ్రోజన్‌ను కనుగొన్నారు. 2009లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-1లోని నాసా నాసా పరికరం చంద్రుని ఉపరితలంపై నీటిని గుర్తించింది.


అదే సంవత్సరంలో, దక్షిణ ధ్రువాన్ని తాకిన మరో NASA పరికరం చంద్రుని ఉపరితలం క్రింద నీటి మంచును కనుగొంది. మునుపటి NASA మిషన్, 1998 లూనార్ ప్రాస్పెక్టర్, దక్షిణ ధ్రువం నీడతో కూడిన క్రేటర్లలో నీటి మంచు ఉన్నట్లు గుర్తించారు.


చంద్రునిపై నీరు ఎందుకు ముఖ్యమైనది?
చంద్రుడిపై నీటి మంచు పాకెట్స్‌ను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఆసక్తితో ఉన్నారు. ఒక వేళ గుర్తించగలిగితే చంద్ర అగ్నిపర్వతాలు, గ్రహశకలాల గురించి ప్రయోగాలకు ఉపయోగపడనుంది. అలాగే భూమిపై సముద్రాల్లో నీటికి మూలాలను వెతికేందుకు సాయపడే అవకాశం ఉంది. 


నీటి మంచు తగినంత పరిమాణంలో ఉన్నట్లయితే చంద్రునిపై తాగునీటిని గుర్తించడానికి దోహదపడుతుంది. అంగారక గ్రహంపై ప్రయోగాలు, చంద్రుడిపై ప్రయోగాలకు ఉపయోగపడేలా నీటి మంచు నుంచి హైడ్రోజన్ ఇంధనం తయారీ, ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చు. 


చంద్రుడిపై యాజమాన్యాన్ని ఏ దేశం క్లెయియ్ చేసుకోకుండా 1967లో ఐక్యరాజ్యసమితి ఔటర్ స్పేస్ ట్రీటీ నిషేధం విధించింది. కానీ వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసేలా నిబంధనలు విధించలేదు. చంద్రుని అన్వేషణ, దాని వనరుల వినియోగానికి సంబంధించిన అంశాలపై US నేతృత్వంలోని కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. ఇందులో 27 మంది సంతకాలు చేశారు. చైనా, రష్యా సంతకాలు చేయలేదు.


ఏం ఉంది అక్కడ?
ఇంతకు ముందు చంద్రుడిపై ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రష్యాకు చెందిన లూనా-25 క్రాఫ్ట్ ఈ వారం దక్షిణ ధృవం మీద ల్యాండ్ కావాల్సి ఉండగా ఆదివారం అదుపు తప్పి కూలిపోయింది. దక్షిణ ధ్రువం భూమధ్యరేఖ ప్రాంతానికి చాలా దూరంగా ఉంది. గతంలో అపోలో ల్యాండింగ్‌, ఇతర మిషన్లు అన్నీ దక్షిణ ధృవానికి దూరంగా జరిగాయి. ఇక్కడ రాళ్లు, లోతైన గుంతలు, లోయలు ఉన్నాయి. 


ఇస్రో చంద్రయాన్-3 మిషన్ బుధవారం ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించనున్నట్లు ఇస్రో తెలిపింది. 2019లో సురక్షితంగా ల్యాండ్ చేయడంలో చంద్రయాన్-2 విఫలమైంది.