SCR Key Announcement On Bhagamati Train Accident: తమిళనాడులోని (Tamilnadu) తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును.. భాగమతి ఎక్స్ ప్రెస్ (Bhagamati Express) ఈ నెల 11న ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించగా దర్యాప్తు కొనసాగుతోంది. రైలు ప్రమాద ఘటనపై ఈ నెల 16, 17 తేదీల్లో చెన్నైలో  రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేయనున్నారని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు తమను సంప్రదించాలని ద.మ రైల్వే (South Central Railway) సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.


అన్ని కోణాల్లో దర్యాప్తు


కాగా, రైలు ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక లోపమా.? లేక సిగ్నలింగ్ వైఫల్యమా.?, కుట్ర కోణమా.? ఇతర కారణాలేమైనా ఉన్నాయా.? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే.. వాటితో పాటు చట్టబద్ధమైన విచారణకు హాజరు కావాలని కోరారు. ఈ కేసు విచారణ పార్క్ టౌన్‌లోని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) కార్యాలయంలో రైల్వే భద్రత కమిషనర్ నేతృత్వంలో జరగనున్నట్లు వెల్లడించారు.


ఇదీ జరిగింది


తమిళనాడులోని చెన్నై శివారులో ఈ నెల 11 (శుక్రవారం) రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఏపీ, తెలంగాణ మీదుగా దర్బంగా వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ ప్రెస్ (రైలు నెం. 12578).. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ గూడ్స్ రైలును అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 వరకూ భోగీలు పట్టాలు తప్పాయి. 2 భోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. కొన్ని భోగీలు చెల్లాచెదురుగా పడిపోగా.. మరికొన్ని ఒకదానిపై ఒకటి చేరాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పలువురు ప్రయాణికులు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు పోలీసులు 4 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు ఎన్ఐఏ సహా వివిధ ఏజెన్సీల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.


Also Read: Free Tomatoes : ఉచితంగా అరకేజీ టొమాటాలు ఇస్తున్నారని స్విగ్గిపై ఫిర్యాదు - ఈ పెద్దాయన ఉచితాలకు మరీ వ్యతిరేకంగా ఉన్నాడే !