Navjot Singh Sidhu: 1988 నాటి కేసులో లొంగిపోయేందుకు తనకు మరింత సమయం కావాలని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో సుప్రీం కోర్టు సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే ఆరోగ్య కారణాల వల్ల లొంగిపోవడానికి కొంత సమయం కావాలని సిద్ధూ కోరారు.
నో చెప్పిన కోర్టు
అయితే ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం ముందు ప్రస్తావించాలని న్యాయస్థానం తెలిపింది. సిద్ధూ వేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నవజోత్ సింగ్ సిద్ధూ పటియాలా కోర్టులో శుక్రవారం లొంగిపోవాల్సి ఉంది.
ఇదే కేసు
1988, డిసెంబర్ 27న రోడ్డుపై సిద్ధూకు, గుర్నామ్ సింగ్ అనే 65 ఏళ్ల వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిని సిద్ధూ తలపై కొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పటియాలాలోని ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆ వృద్ధుడిని వాహనంలో నుంచి బయటకు లాగి మరీ సిద్ధూ పిడిగుద్దులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు 1999లో సిద్ధూను, ఆయన స్నేహితుడు సంధూను నిర్దోషులుగా తేల్చుతూ తీర్పిచ్చింది. బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు పక్కకు పెట్టింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2007లో ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. సిద్ధూకు సెక్షన్ 323 కింద రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పుపై బాధిత కుటుంబం అభ్యంతరం తెలుపుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ రివ్యూ పిటిషన్‌ను విచారించిన సుప్రీం రూ.1000 జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పిచ్చింది. 34 ఏళ్ల నాటి కేసులో సుప్రీం తీర్పును వెలువరించింది.
Also Read: Bengaluru airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు- భద్రత పెంపు
Also Read: Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి