Bengaluru airport: బెంగ‌ళూరు నగరంలోని కెంపెగౌడ అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టామ‌ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు, సీఐఎస్ఎఫ్ జ‌వాన్లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. విమానాశ్రయంలో అదనపు సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.






డాగ్ స్క్వాడ్‌, బాంబు డిస్పోజ‌ల్ స్క్వాడ్‌తో ఎయిర్‌పోర్టును క్షుణ్ణంగా త‌నిఖీలు చేశారు. ప్ర‌యాణికుల‌ను కూడా త‌నిఖీలు చేసిన అనంత‌రం అది ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధరించారు.


తెల్లవారుజామున


శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఎయిర్‌పోర్టు కంట్రోల్ రూమ్‌కు 3:50 గంట‌ల‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. గంట పాటు ఎయిర్‌పోర్టు ప‌రిస‌రాలు, ట‌ర్మిన‌ల్ బిల్డింగ్స్‌తో పాటు అనుమానాస్ప‌ద వ‌స్తువుల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేసినట్లు పేర్కొన్నారు. 


బెదిరింపు కాల్‌తో విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డాగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించాయి. 


సీఎం ఇంటికి


మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఇంటిని బాంబులతో పేల్చి వేస్తామంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన తమిళనాడు పోలీసులు తిరునల్వేలి జిల్లాకు చెందిన యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఎగ్మూర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు బుధవారం ఫోన్‌ చేసిన అజ్ఞాత వ్యక్తి, సీఎం ఇంటి వద్ద బాంబులు పెట్టినట్లు చెప్పాడు. ఈ బాంబులు కాసేపట్లో పేలనున్నాయని, చేతనైతే అడ్డుకోవాలని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు.


దీంతో పోలీసులు, బాండ్‌ స్క్వాడ్‌తో హూటాహుటిన సీఎం ఇల్లు, కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేపట్టింది. అయితే ఇది ఫేక్‌ కాల్‌ అని నిర్ధరించారు. సైబర్‌ క్రైం విభాగం సహాయంతో ఆ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చారు. తిరునల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన తామరైకన్నన్‌ చేసినట్లు నిర్ధారించి అరెస్ట్‌ చేశారు. బెదిరింపు కాల్ ఎందుకు చేశాడో యువకుడ్ని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. 


Also Read: Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!


Also Read: CBI Raids: లాలూ యాదవ్‌కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ