Second Flight with Deportees From US To Land In Amritsar | అమృత్‌సర్: అమెరికా అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదివరకే భారత్‌కు ఓ విమానంలో వలసదారులను అమెరికా పంపేసింది. తాజాగా మరో విమానం అమెరికా నుంచి వస్తోంది. 119 మందితో కూడిన విమానం సీ 17 పంజాబ్లోని అమృత్‌సర్‌కు శనివారం రాత్రి 10, 11 గంటలకు చేరుకోనుందని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ విమానం అగ్రరాజ్యం నుంచి భారత్‌కు బయలుదేరడం తెలిసిందే. తాజాగా ల్యాండ్ కానున్న ఈ సీ17 విమానంలో 67 మంది పంజాబ్ వాసులు, 33 మంది హర్యానా, 8 మంది గుజరాతీలు, ఉత్తరప్రదేశ్ వాసులు ముగ్గురు, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు ఒక్కరు చొప్పున ఉన్నారని సమాచారం. ట్రంప్ ప్రభుత్వం ఇదివరకే 104 మంది భారతీయులను స్వదేశానికి తిప్పి పంపింది. నేడు రెండో విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ కానుండగా, మూడో విమానం ఫిబ్రవరి 16న భారత్‌కు చేరుతుందని అధికారులు చెబుతున్నారు.
పంజాబ్ సీఎం ఆగ్రహం
అమృత్‌సర్‌లో అక్రమ వలసదారుల విమానం ల్యాండ్ కావడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆయన పంజాబ్ ను కించపరచాలన్న ఉద్దేశంతోనే ఆ అమెరికా నుంచి వస్తున్న విమానాలను అమృత్‌సర్‌లో ల్యాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ రాష్ట్రంలో వలసదారుల తరలింపు విమానాలను ఎందుకు ల్యాండ్ చేస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖను పంజాబ్ సీఎం ప్రశ్నించారు. ఆ విమానాలను ల్యాండ్ చేయడానికి అమృత్‌సర్‌ను ఏ కారణాలు, ఏ ప్రమాణాలు పాటించి ఎంచుకున్నారో విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భారత ప్రజలకు ట్రంప్ ఇచ్చిన బహుమతి ఇదేనా? అంటూ మండిపడ్డారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, “విద్యార్థులు, ఉద్యోగులు చట్టపరంగా అమెరికాలో నివాసం ఉండాలి. కానీ అక్రమంగా అక్కడ ఉండటం వారి చట్టాలను ఉల్లంఘించడమే అవుతుంది. అన్ని దేశాలు అమెరికాకు అక్రమ వలసలు నివారించాలని, లేకపోతే ఆ దేశాలపై భారీగా పన్నులు విధిస్తామని అమెరికా అధినేత ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కనుక ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు ఇతర దేశాలకు ఉండదు. తప్పు జరిగితే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుందని” అన్నారు.
అక్రమ వలసలపై మోదీ కీలక వ్యాఖ్యలు
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ అక్రమ వలసలపై స్పందించారు. ఏ దేశంలోనైనా అక్రమ వలసలను ఉపేక్షించరని, వారిని స్వదేశాలకు తరలించడం సరైన నిర్ణయమని డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారు. అమెరికాలో ఉంటున్న భారత్‌కు చెందిన అక్రమవలసదారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తామని సైతం చెప్పారు. తన నిర్ణయాన్ని మోదీ స్వాగతిస్తారనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ అమెరికాలో కాలుపెట్టిన సమయంలోనే భారత్‌కు అక్రమ వలసదారులను ఓ విమానంలో ట్రంప్ ప్రభుత్వం తరలించింది.