Mid Day Meals: 


మిడ్‌ డే మీల్స్‌లో ఊసరవెల్లి..


బిహార్‌లోని సీతమర్హి జిల్లాలోని ఓ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతానికి విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు వెల్లడించారు. అసలు వీళ్లు అస్వస్థకు గురవ్వడానికి కారణమేంటని ఆరా తీస్తే...మధ్యాహ్న భోజనంలో ఓ ఊసరవెల్లి పడిందని తేలింది. అందరూ తిన్న తిరవాత ఉన్నట్టుండి అందులో ఊసరవెల్లి కనిపించిందని, అప్పటికే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని స్కూల్ యాజమాన్యం తెలిపింది. గత నెల కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలోని ఓ స్కూల్‌లో మిడ్ డే మీల్స్‌ తిన్న తరవాత 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మిడ్‌ డే మీల్స్ అందిస్తున్న కాంట్రాక్టర్‌కి షో కాజ్ నోటీసులు జారీ చేసింది. క్రైమ్ టీమ్‌ని రంగంలోకి దింపి విచారణ చేపట్టింది. అంతకు ముందు కూడా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు కొందరు కాంట్రాక్టర్‌లు. నాసిరకమైన బియ్యంతో అన్నం వండి పంపుతున్నారు. వండే చోట పరిశుభ్రంగా ఉండడం లేదు. అందులో బల్లులు, పురుగులు పడడం...వాటినే పిల్లలకు అందించడం సర్వసాధారణమైపోయింది.