Sabarimala pilgrims to get free insurance coverage of Rs 5 lakh | కొట్టాయం: ప్రతి ఏడాది పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప స్వామి మాల ధరిస్తుంటారు. మండలం, మకరజ్యోతి యాత్ర సమయంలో ఇరుముడితో వెళ్లే భక్తులతో పాటు సాధారణ భక్తులు సైతం శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మండలం- మకరవిలక్కు (Mandalam-Makaravilakku) సమయంలో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఉచిత బీమా కల్పించాలని నిర్ణయించారు. శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(Travancore Devaswom Board) ఉచిత బీమా నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ శనివారం తెలిపారు.
పోలీస్, ఫైర్, రెస్క్యూ టీమ్ ఏర్పాటు
కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ మాట్లాడుతూ.. నవంబర్ నెలాఖరులో ప్రారంభమయ్యే యాత్రా సీజన్‌లో అయ్యప్ప స్వామి వారి దర్శనం సాఫీగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే, ఆ భక్తుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లను చేస్తుంది. ఈ ఏడాది శబరిమల యాత్రా సీజన్ లో 13,600 మంది పోలీస్ అధికారులు, 2,500 ఫైర్, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందించనున్నారు. టీడీబీ రైల్వే స్టేషన్ల వద్ద అదనపు పోలీస్ సిబ్బందిని, అటవీ శాఖ 132 సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1500 ఎకో గార్డ్స్ భక్తులకు సహాయం చేయనున్నారు.
తాగునీటి, వైద్య సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం ఫోకస్
భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు వైద్య సదుపాయాల కోసం నిలక్కల్, సన్నిధానం (టెంపుల్ కాంప్లెక్స్), కొట్టాయంలోని మెడికల్, పథనంతిట్ట కాంజిరాపల్లి జనరల్ హాస్పిటల్స్ లో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పంబా, అప్పచిమెడు, సన్నిధానం సహా సమీపంలోని ఆసుపత్రుల్లో గుండె సంబంధిత వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది మండలం నుంచి మకర జ్యోతి దర్శనం సమయంలో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేశామన్నారు. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇరుముడితో వెళ్లే భక్తులకు అలర్ట్
ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కొన్ని రోజుల కిందట పౌర విమానయాన శాఖ నిబంధనలు సడలించింది. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం అయ్యప్ప భక్తులు ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించే అవకాశం కల్పించింది. మండలం నుంచి మకర జ్యోతి దర్శనం (వచ్చే ఏడాది జనవరి 20) వరకు కల్పించిన ఈ సౌకర్యాన్ని అయ్యప్ప భక్తులు వినియోగించుకోవాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. అదే సమయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలని అయ్యప్ప భక్తులను ఆయన కోరారు. ఈ మేరకు ఇటీవల ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని పోస్ట్ చేశారు.