Saamana On BRS: మహారాష్ట్రలో పార్టీని విస్తరించే పనిలో కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటికే చాలా సార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. రీసెంట్‌గా రెండు రోజల పాటు అక్కడ భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. మంగళవారం భారీ బహిరంగ సభను పండరీపూర్‌లో పెట్టారు. అక్కడ మాట్లాడిన కేసీఆర్ రాజకీయపార్టీలపై తీవ్రవిమర్శలు చేసారు. దీనిపై శివసేన మండిపడింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలతో కాలమ్ రాసింది. ఒవైసీ తర్వాత హైదరాబాద్ నుంచి మరో బృందాన్ని మహారాష్ట్రకు పంపించారని కామెంట్ చేసింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీకి లాభం చేకూర్చడమే బీఆర్ఎస్ టార్గెట్ అంటూ విమర్శలు చేసింది శివసేన. తన కుమార్తె కవితను ఈడీ కేసుల నుంచి తప్పించడానికి కేసీఆర్ ఇదంతా చేస్తున్నారా అని ప్రశ్నించింది.
కేసీఆర్ వల్ల బీజేపీకే లాభం: సామ్నా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ విచారణకు పిలిచింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి, తెలంగాణలోని కొందరు మద్యం కాంట్రాక్టర్లకు కవిత మధ్యవర్తిగా వ్యవహరించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయని తెలిపారు. కానీ వారు తీసుకుంటున్న రాజకీయ అడుగులు పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చేవేనన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని, 2019 నుంచి బీజేపీకి అనుకూలంగా ఓట్లు చీలుస్తున్న ఒవైసీకి కూడా హైదరాబాద్‌లోనే ప్రధాన కార్యాలయం ఉంది. ఓట్లను చీల్చేందుకు ఒవైసీ మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఆయన తన పని తాను చేసుకుపోయారు కానీ ఒవైసీ ట్రిక్‌ను అర్థం చేసుకున్న తర్వాత ముస్లింలు, దళితులు ఎంఐఎం ఉచ్చులో పడబోరని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఒవైసీ స్థానంలో కేసీఆర్‌ను బీజేపీ నియమించిందా? బీజేపీకి 'బీ' టీమ్ గా కేసీఆర్, ఆయన పార్టీ పనిచేస్తోందా? అని సామ్నాలో శివసేన ఆరోపించింది.
కేసీఆర్‌ను బీజేపీ వాడుకుంటోందని ఆ కథనంలో ఆరోపించారు. మహారాష్ట్రలో ఈ పార్టీ (బీఆర్ఎస్) ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి రాజకీయంగా సహాయపడుతుందా, ఈ ట్రిక్‌ను స్థానిక ప్రజలు సకాలంలో గుర్తించాలి. కానీ మొత్తం మీద ఆయన పార్టీ భారత రాష్ట్ర సమితి ఓట్లు చీల్చి బిజెపికి పట్టం కట్టడానికే పనిచేస్తుంది. నిజం చెప్పాలంటే తెలంగాణలో కేసీఆర్ పార్టీకి ప్రమాదం పొంచి ఉంది. ఆయన కాళ్ల కిందకు నీళ్లు వచ్చేశాయి.