Parliament Session: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బిల్లుకు నారీ శక్తి చట్టం అని నామకరణం చేశారు. అదే సమయంలో లోక్ సభలో కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు గందరగోళం సృష్టిస్తున్నారు. నారీ శక్తి వందన బిల్లుపై లోక్ సభలో గందరగోళం నెలకొంది. లోక్ సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాలు గళమెత్తాయి. బిల్లును ప్రచారం చేయకుండా ఎలా ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ బిల్లును వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు మొదటి కాపీని ఎంపీలకు ఇవ్వాల్సి ఉంటుంది అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. యూపీఏ హయాంలో తీసుకురావాలనుకున్న బిల్లుకు, ప్రస్తుతం బిల్లుకు కొన్ని తేడాలు మినహా మిగతాదంతా ఒకటే. అయితే ఈ బిల్లును తీసుకురావడంపై ఏ పార్టీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందన్న దానిపై లోక్‌సభ లో రగడ మొదలైంది.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ పై లోక్ సభలో రచ్చ మొదలైంది. మహిళా బిల్ల లోక్‌సభలో ఆమోదం పొందిందన్న అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేదని తెలిపారు. అధిర్ రంజన్ చెప్పినది అవాస్తవమని అన్నారు. పాత బిల్లు రద్దు అయిందని అమిత్ షా తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందన్నది నిజమైతే అందుకు సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించాలని లేదంటే తన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకోవాలని తెలిపారు.