PM Visits Chief Justice's Home For Ganesh Puja: భారత చీఫ్‌ జస్టీస్ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణేష్‌ పూజకు ప్రధానమంత్రి హాజరవ్వడం తీవ్ర దుమారం రేగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అక్కడకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇదిప్పుుడు రాజకీయంగా కాక రేపుతోంది. జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి వెళ్లిన ప్రధాని అక్కడ విఘ్నేశ్వర పూజలో పాల్గొని హారతి కూడా ఇచ్చారు.





ఇది మోదీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అధికరా విపక్షాల మధ్య పరస్పర విమర్శలు రాజుకున్నాయి. కొందరు సుప్రీం కోర్టు న్యాయవాదులు కూడా ఈ చర్యను తప్పుపడుతున్నారు. కాన్‌స్టిట్యూషన్‌కు రక్షణగా ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉన్న వారిని కలవడంపై దేశ ప్రజల్లో అనుమానాలు బయలు దేరాయని శివసేన ఆరోపించింది. తమ కేసు ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచ్‌ మీద విచారణంలో ఉన్న సమయంలో మోదీ ఆయన నివాసానికి వెళ్లడంతో తమకు న్యాయం జరుగుతుందా అన్న అనుమానాలు ఏర్పడ్డాయని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో కేంద్రం కూడా భాగస్వామ్య పక్షంగా ఉందని.. ఆ ప్రభుత్వానికీ నేతృత్వం వహిస్తున్న మోదీ ఈ సమయంలో చీఫ్‌ జస్టిస్ ఇంటికి వెళ్లడం సరికాదని అన్నారు. ఈ కేసు విచారణ నుంచి చీఫ్ జస్టిస్ తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


ఈ ఘటనపై ఆశ్చర్యం వక్తం చేసిన ఎన్‌సీపీ మహిళా నేత సుప్రియా సూలే.. చీఫ్‌ జస్టిస్ వ్యక్తిత్వంపై తనకు ఏ విధమైన అనుమానాలు లేవన్నారు. మరో మహారాష్ట్ర మహిళానేత ప్రియాంక చతుర్వేది మాత్రం మహారాష్ట్ర ఎన్నికలకు ముడిపెడుతూ సందేహాలు వ్యక్తం చేశారు. సీజేఐ ఇంటికి మోదీ వెళ్లి గణేశుడి పూజలో పాల్గొనడం సరికాదన్న ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌.. జస్టిస్ డీవై చంద్రచూడ్‌ తన విశ్వాసాన్ని కోల్పోయారని.. ఈ ఘటనను సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు.


Also Read: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో తీవ్ర ఇబ్బందులు


 ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆచితూచి స్పందించింది. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను పబ్లిక్‌తో పంచుకొని ప్రచారానికి వాడుకోవడం సరికాదని అభిప్రాయపడింది. అసలు మోదీ చీఫ్‌ జస్టిస్ ఇంటికి వెళ్లడమే సరికాదన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ , సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కపిల్‌ సిబల్‌.. ఆ వీడియోను మళ్లీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ఏంటని నిలదీశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే రాజ్యాంగ వ్యవస్థలపై అనుమానాలు రేకెత్తెలా వ్యవరహరించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. చీఫ్‌ జస్టిస్‌పై తనకు అపారమైన విశ్వాసం ఉందన్న సిబల్‌.. ఈ వీడియోను మోదీ తన ప్రచార వ్యామోహానికి వాడుకుంటారని జస్టిస్ చంద్రచూడ్ అంచనా వేసి ఉండరని అన్నారు.






 విపక్షాల విమర్శలపై భారతీయ జనతా పార్టీ కూడా ఎదురుదాడికి దిగింది. గతంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు నాటి సీజేఐ హాజరవడంలో అప్పుడు తప్పు కనిపించలేదా అని భాజపా స్పోక్స్‌పర్సన్ సంబిత్ పాత్ర ప్రశ్నించారు.





ప్రధాని వెళ్లి సీజేఐని కలిస్తే అభ్యంతరం లేదని, గణపతిపూజలో పాల్గొనడమే వారికి తప్పుగా తోచినట్లుందని పాత్ర నిలదీశారు. మన ప్రధాని వెళ్లి మన చీఫ్‌ జస్టిస్‌ను కలిస్తే అభ్యంతరాలు చెబుతున్న విపక్షాలు.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు మద్దతు తెలిపే ‌అమెరికన్ చట్ట సభ్యురాలైన ఇల్హాన్‌ ఒమర్‌ను లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత రాహుల్‌గాంధీ కలిస్తే మాత్రం నోరు పెదరని సంబిత్ మండిపడ్డారు.


Also Read: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట - షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు