Kejriwal Ed Custody: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు రౌస్ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. ఆయన్ను 6 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 28 వరకూ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. గురువారం రాత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆయన్ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు, కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ సహా పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుగా ఉన్నారని.. ఆయన్ను 10 రోజుల తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. అటు, సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధమని, లిక్కర్ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాదాపు రెండున్నర గంటల పాటు వాడీ వేడీ వాదనలు సాగాయి. ఇరు వర్గాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి తొలుత తీర్పును రిజర్వు చేశారు. తాజాగా, కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.






ఈడీ కీలక అభియోగాలివే


ఢిల్లీ మద్యం కేసులో ఈడీ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. 'సౌత్ గ్రూప్' సంస్థకు, నిందితులకు ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. 'లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ కీలక సూత్రధారి. ఈ పాలసీ రూపకల్పనలో ఆయన భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఉన్న 'సౌత్ గ్రూప్' సంస్థ నుంచి కేజ్రీవాల్ రూ.కోట్ల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు. గోవా ఎన్నికల్లో రూ.45 కోట్ల ముడుపులను ఉపయోగించారు. అవి 4 హవాలా మార్గాల నుంచి వచ్చాయి. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఈ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నాం.' అని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. మొత్తంగా 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించింది.


'అధికార దురహంకారం'


మరోవైపు, కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మూడుసార్లు ఎన్నికైన ముఖ్యమంత్రిని ప్రధాని మోదీజీ అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు. ఆయన అందరినీ అణచి వేసేందుకు యత్నిస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహం. మీ సీఎం ఎప్పుడూ మీ వెంటే ఉన్నారు. కేజ్రీవాల్ తన జీవితాన్ని దేశానికే అంకితం చేశారు. ప్రజలకు ప్రతీ విషయం తెలుసు.' అని ఆమె ట్వీట్ చేశారు.


Also Read: Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్‌తో బీజేపీకి భారీ విరాళాలు, టాప్ డోనార్స్ లిస్ట్ ఇదే