Ricky Kej : భారత్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ (Ricky Kej) మరోసారి తన సత్తా చాటారు. ఇప్పటికే మూడుసార్లు గ్రామీ పురస్కారాలు అందుకున్న ఆయన్ను ఇప్పుడు పద్మ అవార్డు వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ పురస్కారాలను ప్రకటించగా.. రిక్కీ కేజ్ పద్మశ్రీకి ఎంపికైనట్టు తెలిపింది. తాజాగా ఈ అవార్డు ప్రకటనపై స్పందించిన రిక్కీ.. తనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డే తనకు అంతిమ లక్ష్యం కాదని, తన కెరీర్‌లో కొత్త ప్రారంభానికి గుర్తుగా ఇది నిలుస్తుందని చెప్పారు. అంతర్జాతీయ కళాకారులను ప్రోత్సహించి వారి ప్రతిభను గుర్తించే వాతావరణాన్ని ప్రధాని కల్పించారన్నారన్నారు. ఇది కొత్త భారతదేశం. కాబట్టి ఇక్కడ కళాకారులు ఏదీ అడగాల్సిన అవసరం లేదని చెప్పారు.
రిక్కీ కేజ్ గురించి
రిక్కీ కేజ్ 1981లో అమెరికాలోని ఉత్తర కరోలినాలో భారతీయల దంపతులకు జన్మించారు. అతనికి 8 ఏళ్ల వయసులోనే వారి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. అక్కడే ఆక్స్ ఫర్డ్ డెంటల్ కాలేజీలో రిక్కీ డిగ్రీ పూర్తి చేయడానికి ముందు బిషప్ కాటన్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. 2015లో మొదటిసారి గ్రామీ అవార్డ్ పొందారు. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో విండ్స్ ఆఫ్ సంసారాకు ఈ అవార్డ్ అందుకున్నారు. ఆ తర్వాత 2022లో ఇదే కేటగిరీలో డివైన్ టైడ్స్‌కు గానూ అవార్డు స్వీకరించారు. అనంతరం మరోసారి 2023లో డివైన్ టైడ్స్‌కు అవార్డ్ అందుకోవడం చెప్పుకోదగిన విషయం. అంతేకాదు భారతదేశం నుంచి చిన్న వయసులోనే గ్రామీ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడిగా, 4వ భారతీయుడిగా పేరు గడించారు.
పద్మ అవార్డుల ప్రకటన
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం ఈసారి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను అందుకోనున్న అజ్ఞాత వీరులు, సాధకుల పేర్లను వెల్లడించింది. సాధారణంగా పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తారు. కాగా ఈ ఏడాది పద్మ విభూషణ్‌కు ఏడుగురు, పద్మ భూషణ్‌కు 19, పద్మశ్రీకి 113 మంది పేర్లతో కలిపి మొత్తం 139 మందిని ప్రకటించారు. ఈ అవార్డు గ్రహీతలు కళ, సామాజిక సేవ, సైన్స్, మెడిసిన్ లాంటి విభిన్న రంగాలలో వారి నైపుణ్యానికి గుర్తింపు పొందారు.
Also Read : Padma Awards 2025 : పద్మ అవార్డులను ప్రారంభంలో ఈ పేర్లతోనే పిలిచేవారట - ఇంతకీ ఆ పేర్లు ఏంటంటే..