J&K Elections: 


ఎన్నికలకు రెడీ..


జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో వివరణ కూడా ఇచ్చింది. త్వరలోనే ఎన్నికలు తేదీలను ప్రకటించాలని కోరింది. అయితే...ఈ నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమే అని వెల్లడించింది. నిజానికి సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ వరుసగా పిటిషన్‌లో దాఖలయ్యాయి. వీటిపై విచారిస్తున్న సమయంలోనే కేంద్రం ఈ విషయం ప్రస్తావించింది. ఇప్పటికే ఈ అంశంలో కేంద్రం తన వాదనలు వినిపించింది. ఈ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాల్సిన అవసరముంది కాబట్టే ఆ పని చేశామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌లపై సమాధానమిస్తూ జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరముందని తేల్చి చెప్పింది 2018 జూన్ నుంచి ఇప్పటి వరకూ అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం లేదని అసహనం వ్యక్తం చేసింది. 






రాష్ట్రహోదాపై వాదనలు..


జమ్ముకశ్మీర్‌కి రాష్ట్రహోదాని పునరుద్ధరించడంపైనా కోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై సుప్రీంకోర్టు వివరణ అడగ్గా కేంద్రం స్పందించింది. ఎప్పటికి రాష్ట్ర హోదాని ఇస్తామన్న విషయాన్ని ఇప్పుడు చెప్పలేమని స్పష్టం చేసింది. లద్దాఖ్‌ నుంచి ఎక్కువ మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీరిలో కొందరు రాజకీయ నాయకులూ ఉన్నారు. లద్దాఖ్ ఎప్పటికీ కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంటుందన్న సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు పిటిషనర్లు. దాదాపు రెండేళ్లుగా లద్దాఖ్‌ని ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై ఆందోళనలూ జరుగుతున్నాయి. ఈ వాదనల క్రమంలోనే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చని వెల్లడించారు. ఓటరు జాబితా అప్‌డేషన్ పూర్తైందని సుప్రీంకోర్టుకి తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలు దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. 


"జమ్ముకశ్మీర్‌లో మూడు ఎన్నికలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. తొలిసారి మూడంచెల పంచాయత్ రాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టాం. మొదటగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే జిల్లా అభివృద్ధి కౌన్సిల్ ఎన్నికలు పూర్తయ్యాయి"


- తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ 


ఆర్టికల్ రద్దుకి నాలుగేళ్లు..


ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 A ని రద్దు చేసి, జమ్మూ, కాశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాల కార్టోగ్రాఫిక్ సరిహద్దులను నిర్వచించే కొత్త మ్యాప్‌ను ప్రచురించడం ద్వారా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్‌ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల కొత్త మ్యాప్‌లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఉత్తర ప్రాంతాలు, 1963లో పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన షక్స్‌గామ్ లోయ, చైనా ఆక్రమించిన అక్సాయ్ చిన్‌లను భారత్‌లో కలుపుతూ కొత్త మ్యాపులు ప్రచురించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ద్వైపాక్షిక, పర్యటనలకు విదేశాలకు వెళ్లినప్పుడు ఎవరూ కూడా జమ్ము కశ్మీర్‌లను ప్రస్తావించలేదు. భారత్‌లో జమ్ము, కాశ్మీర్‌ను కలుపుతూ లీగల్ పేపర్లలో కలిపినా ఎవరూ నోరు మెదపలేదు.  


Also Read: సెప్టెంబర్‌లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, కేంద్రం కీలక ప్రకటన