Journalist Rana Ayyub: ప్రముఖ జర్నలిస్టు రానా ఆయుబ్‌ను ముంబయి ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకోవడం చర్చనీయాంశం అయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన వేళ.. రానా ఆయుబ్ లండన్ వెళ్తుండగా ముంబయి విమానాశ్రయంలో  అధికారులు నిలిపివేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల వల్ల ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. 


‘‘జర్నలిస్టులకు బెదిరింపులు అనే అంశంపై మాట్లాడేందుకు లండన్ వెళ్తుండగా ముంబయిలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై మాట్లాడేందుకు నేను ఇటలీకి కూడా వెళ్లాల్సి ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని Doughty Street International అండ్ జర్నలిజం ఫెస్టివల్ కోసం డాక్టర్ జూలీ పోసెట్టి ప్లాన్ చేశారు. నా సోషల్ మీడియా అకౌంట్లలో కూడా చాలా రోజుల నుంచి దీని గురించి చెప్తున్నాను. కానీ, ముంబయి ఎయిర్ పోర్టులో నన్ను ఆపేసిన తర్వాత ఈడీ నుంచి నాకు మెయిల్ ద్వారా సమన్లు అందాయి’’ అని రానా ఆయుబ్ ట్వీట్ చేశారు. 




గత ఫిబ్రవరిలో ఈడీ రానా ఆయూబ్‌కు చెందిన రూ.1.77 కోట్లను సీజ్ చేసింది. ఆమె చేపట్టిన మూడు సహాయ కార్యక్రమాలకు వచ్చిన విరాళాన్ని ఆమె సరైన ప్రయోజనం కోసం ఉపయోగించలేదని ఈడీ అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్య తీసుకుంది. హిందూ ఐటీ సెల్‌ అనే ఎన్జీవోకు చెందిన వికాస్ సాంక్రుత్యన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు పెట్టారు. 


పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. మురికివాడలు, రైతుల కోసం ఏప్రిల్-మే 2020లో విరాళాలు సేకరణ చేపట్టారు. జూన్ - సెప్టెంబరు 2020 కాలంలో అసోం, బిహార్, మహారాష్ట్రల్లో సహాయ కార్యక్రమాల కోసం విరాళాలకు పిలుపునిచ్చారు. 2021 మే, జూన్ సమయంలో కరోనా ప్రభావిత వ్యక్తులకు సాయం చేసేందుకు కూడా నిధులు సేకరించారు. ‘‘ఈ మొత్తం జమ అయిన రూ.2,69,44,680 లను Ketto అనే క్రౌడ్ ఫండ్ రైజింగ్ లేదా మెడికల్ ఫండ్ రైజింగ్ సంస్థ ద్వారా సేకరించారు. ఈ నిధులను రానా ఆయూబ్ తన సోదరి, తండ్రి బ్యాంకు ఖాతాల ద్వారా బయటకు తీశారు. వీటిలో రూ.72,01,786 సొమ్మును సొంత బ్యాంకు ఖాతా ద్వారానే విత్ డ్రా చేశారు. మరో రూ.37,15,072 నిధులను తన సోదరి ఇఫ్ఫత్ షేక్ అకౌంట్ నుంచి డ్రా చేశారు. తండ్రి మహ్మద్ ఆయూబ్ వాకీఫ్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.1,60,27,822 డబ్బులు డ్రా చేశారు.’’ అని ఎఫ్ఐఆర్‌లో ఉంది.


ఈ నిధులను సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లుగా రానా ఆయూబ్ కొన్ని సంస్థల పేరిట నకిలీ బిల్లులు సృష్టించారని ఎఫ్ఐఆర్‌లో ఉంది. వ్యక్తిగతంగా చేసిన పర్యటనలను కూడా సహాయ కార్యక్రమాల ఖర్చులో లెక్కగట్టారని ఎఫ్ఐఆర్‌లో వివరించారు.