Rajasthan Election 2023: 


రాజస్థాన్‌లో యోగి ఆదిత్యనాథ్..


యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రాజస్థాన్‌ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న పోటీని ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంతో ( Israel-Hamas War) పోల్చారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్..ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో తాలిబన్‌ తరహా ఉగ్రవాదులు తెగబడుతున్నారని, వాళ్లను ఇజ్రాయేల్ ప్రభుత్వం ఎలా అణిచివేస్తోందో గమనించారా..అంటూ ప్రశ్నించారు. ఎక్కడికక్కడే వాళ్లను కట్టడి చేస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదులకు హనుమంతుడి గదే సరైన సమాధానం చెబుతుందని అన్నారు. 


"గాజాలో ఏం జరుగుతోందో గమనిస్తున్నారా..? తాలిబన్ తరహా ఉగ్రవాదులను ఇజ్రాయేల్ ప్రభుత్వం అణిచివేస్తోంది. వాళ్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇలాంటి తాలిబన్‌లకు ఆంజనేయుడి గద గట్టి బదులిస్తుంది. ఇలా ఎదురు దాడికి దిగితే తప్ప ఉగ్రవాదం సమసిపోదు"


- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి


కాంగ్రెస్‌పైనా విమర్శలు..


ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పైనా విమర్శలు గుప్పించారు. విద్వేష రాజకీయాలు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే రాజకీయాలు ఎప్పటికీ సమాజానికి మంచి చేయలేవని మండి పడ్డారు. వాటి మధ్య రాజకీయం ఇరుక్కుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. కశ్మీర్ అంశాన్నీ ప్రస్తావించారు యోగి. ఎన్నో ఏళ్ల ఈ సమస్యని ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా కలిసి పరిష్కరించారని ప్రశంసించారు. 


"కశ్మీర్‌ భారత్‌లో భాగమే అని అప్పుడు సర్దార్ పటేల్ చాలా స్పష్టంగా చెప్పారు. భారత్‌లోనే కలిపారు. కానీ కాంగ్రెస్ నేత జవహర్ లాల్ నెహ్రూ వచ్చాక సమస్యలు మొదలయ్యాయి. ఆ కారణంగానే ఉగ్రవాదం విస్తరించింది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా కలిసి కశ్మీర్ సమస్యను పరిష్కరించారు. అక్కడ ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నారు"


- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి


నేరాలపై ఫైర్..


రాజస్థాన్‌లో మహిళలపై ఘోరాలు పెరుగుతున్నాయని మండి పడ్డారు యోగి. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలందరూ తాలిబన్ల పాలనలో బతికినట్టుగా బతకాల్సి వస్తుందని విమర్శించారు. గతంలో ప్రధాని మోదీ కూడా రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడారు. ఈ నేరాలు తగ్గిపోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చి చెప్పారు. 


రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నవంబరు 25న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థిని మట్టికరిపించి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వసుంధరా రాజేకు ప్రత్యామ్నాయంగా దియా కుమారిని చూపించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న వసుంధరా రాజేకు రెండో జాబితాలో చోటు కల్పించింది. ఆమె మద్దతుదారుల్లో కొందరికి సీటు కేటాయించింది. వసుంధర రాజేను పక్కన పెట్టడం ద్వారా ఏర్పడిన ఖాళీని భర్తీ చేసుకునేందుకే, రాజవంశానికి చెందిన దియా కుమారిని అందలమెక్కిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


Also Read: ఘోర రోడ్డు ప్రమాదం, రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడి మొబైల్ చోరీ