Delhi Crime News:


సౌత్‌ ఢిల్లీలో రోడ్డు ప్రమాదం..


సౌత్ ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొట్టుకున్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి పేరు పియూష్ పాల్‌గా గుర్తించారు..పోలీసులు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌ అని వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే తీవ్ర గాయాలతో రక్తస్రావమైంది. ఫలితంగా ప్రమాదం జరిగిన కాసేపటికే మృతి చెందాడు. అక్టోబర్ 28న రాత్రి 10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అక్కడి సీసీ కెమెరాల్లో యాక్సిడెంట్ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. వేగంగా వెళ్తున్న పియూష్ ఉన్నట్టుండి లైన్ మార్చాడు. ఆ క్రమంలోనే మరో బైక్‌ని ఢీకొట్టాడు. ఆ తరవాత బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది. కొన్ని మీటర్ల దూరం వరకూ దూసుకుపోయింది. పియూష్‌కి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వైద్యం అందించేందుకు వేగంగానే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. గుడ్‌గావ్‌లో ఫ్రీలాన్స్ ఫిల్మ్‌మేకర్‌గా పని చేస్తున్నాడు పియూష్. అయితే...రోడ్డుపైన వెళ్తున్న వాళ్లు పోలీసులు వచ్చేంత వరకూ బాధితుడిని పట్టించుకోలేదు. తీవ్ర రక్తస్రావం అవుతున్నా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాదాపు 20 నిముషాల పాటు అలానే రోడ్డుపై  పడి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైనా సాయం అందించి ఉంటే బతికే అవకాశాలు ఉండేవని మృతుడి స్నేహితులు చెబుతున్నారు. కొంతమంది సాయం చేయకపోగా చుట్టూ చేరి ఫొటోలు తీసుకున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే...బాధితుడి ఫోన్‌ని ఎవరో చోరీ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన బైకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 


"పియూష్ ఫోన్ రాత్రి 10 గంటల వరకూ యాక్టివ్‌గానే ఉంది. ఆ తరవాత స్విచాఫ్ వచ్చింది. ఫ్రీలాన్సింగ్ వర్క్ కోసం తను కొనుక్కున్న కెమెరా కూడా కనిపించడం లేదు. ఈ రెండు వస్తువులనూ తెచ్చి పెట్టాలని మేమేం డిమాండ్ చేయట్లేదు. మాకు న్యాయం మాత్రమే కావాలి"


- మృతుడి స్నేహితుడు