Ashok Gehlot on CM Chair:
అశోక్ గహ్లోట్ వ్యాఖ్యలు..
ఎన్నికల ముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ (Ashok Gehlot) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి గురించి ప్రస్తావిస్తూ సోనియా గాంధీని పొగడ్తల్లో ముంచెత్తారు. సోనియా కారణంగానే తనకు అనుకోకుండా ఈ సీఎం పదవి దక్కిందని చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో అసలు తన పేరే లేదని, కానీ సోనియా తనకు ఎంపిక చేసుకుని మరీ ఈ పదవి కట్టబెట్టారని తెలిపారు. సీఎం పదవి నుంచి దిగిపోతారా అన్న ప్రశ్నలకూ చాలా సెటైరికల్‌గా సమాధానం చెప్పారు గహ్లోట్. ఈ కుర్చీని వదిలిపెట్టాలని లేదని వెల్లడించారు. కానీ...ఆ కుర్చీయే తనను వదలడం లేదంటూ చమత్కరించారు.
"సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యాక ఆమె తీసుకున్న తొలి నిర్ణయం నన్ను రాజస్థాన్‌కి ముఖ్యమంత్రి చేయడం. నిజానికి సీఎం అభ్యర్థుల లిస్ట్‌లో నేను లేను. అయినా సోనియా నన్ను పిలిచి మరీ అవకాశమిచ్చారు. నాకు ఈ సీఎం కుర్చీని వదలాలనే ఉంది. కానీ ఈ పదవే నన్ను వదలడం లేదు"
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
హైకమాండ్ ఏం చెబితే అదే..
హైకమాండ్ తనకు పిలిచి మరీ అవకాశమిచ్చిందని పదేపదే ప్రస్తావించారు అశోక్ గహ్లోట్. ఇప్పటికే మూడు సార్లు తనకు ఈ బాధ్యతలు అప్పగించిందని అన్నారు. ఇకపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పాటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. సీఎం కుర్చీ కోసం అశోక్ గహ్లోట్, సచిన్ పైలట్ (Ashok Gehot Vs Sachin Pilot ) మధ్య దాదాపు మూడేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగరేశారు సచిన్ పైలట్. దీని గురించీ పరోక్షంగా స్పందించారు గహ్లోట్. "క్షమించడం, మర్చిపోవడం" పాలసీనే పాటిస్తున్నానని, ఏం జరిగినా వదిలేసి ముందుకు వెళ్తున్నానని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయడాన్ని ఖండించారు గహ్లోట్. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే దాడులు చేయించడం ఆపేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టికెట్‌ల విషయంలో పార్టీలో అసంతృప్తి ఉందన్న వాదనలపైనా స్పందించారు. అలాంటిదేమీ లేదని, ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న తరవాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: రైల్వే ప్యాంట్రీలోని ఆహార పదార్థాలపై ఎలుకలు, చూసి షాకైన ప్యాసింజర్ - వైరల్ వీడియో