Ashok Gehlot Vs PM Modi:
అశోక్ గహ్లోట్ అసహనం..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మూర్ఖులకే రారాజు" అంటూ మండి పడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ పదవికి తగదని చురకలు అంటించారు. రాహుల్ గాంధీని అలా అవమానించడం చాలా దురదృష్టకరం అని అసహనం వ్యక్తం చేశారు. జైపూర్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన గహ్లోట్...ఈ కామెంట్స్ చేశారు.
"ప్రధాని స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. విమర్శించే ముందు ఆలోచించుకోవాలి. అంత ఉన్నత పదవిలో ఉన్నప్పుడు కాస్త గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి వ్యక్తి నుంచి ఇంకేం ఆశించగలం.."
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
లాల్ డైరీ వివాదం..
రాష్ట్ర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డైరీ పైనా రాజకీయాలు వేడెక్కాయి. Laal Diary పేరుతో ఇప్పటికే రచ్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నేతలు రాజస్థాన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండి పడ్డారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన మంత్రి రాజేంద్ర గుధాని తొలగించారు గహ్లోట్. అప్పటి నుంచి ఈ ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. సీఎంకి వ్యతిరేకంగా కొన్ని కీలక ఆధారాలు ఈ డైరీలో ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీని మూర్ఖుడు అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూనే లాల్ డైరీ వివాదంపైనా స్పందించారు గహ్లోట్.
"ఇదంతా కేంద్రహోంశాఖ కుట్ర అనిపిస్తోంది. అక్కడే దీనికి లాల్ డైరీ అని పేరు పెట్టారు. మా మంత్రితో చేతులు కలిపి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. కావాలనే కుట్ర చేసి ఆయనతో అలా మాట్లాడించారు"
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి