ISRO Space Challenge : ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ ప్రయోగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న యువత చంద్రయాన్ పై ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తున్నరు. ఇలాంటి వారికి ఇస్రో గుడ్ న్యూస్ చెప్పింది. భవిష్యత్‌లో చేపట్టే అంతరిక్ష యాత్రల కోసం రోబోటిక్ రోవర్‌ల రూపకల్పనకు సంబంధించి యువత నుంచి వినూత్న ఆలోచనలు, డిజైన్లను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్పేస్ ఛాలెంజ్‌ను నిర్వహించనుంది. ఈ చాలెంజ్ లో ఎవరైనా పాల్గొనవచ్చు.
భవిష్యత్ చంద్రయాన్ ప్రయోగాల కోసం రోవర్ డిజైన్లు
చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్‌ను ఇస్రో విజయవంతంగా దించినింది. దీనికి కొనసాగింపుగా చంద్రునితో పాటు ఇతర ఖగోళ వస్తువుల వద్దకు మరిన్ని రోబోటిక్ యాత్రలు చేపట్టేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇస్రో లక్ష్యాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు విద్యా సంస్థలు, పరిశ్రమలకు అవకాశాలు కల్పించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా యువత నుంచి రోబోటిక్ రోవర్ల డిజైన్లకు సంబంధించిన వినూత్న ఆలోచనలను బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రం కోరుతోంది. భవిష్యత్‌లో చేపట్టబోయే చేపట్టబోయే గ్రహాంతర యాత్రల కోసం యువతలోని సృజనాత్మక ఆలోచనలను ఉపయోగించుకోవడం, భాగస్వామ్య పక్షాలకు అంతరిక్ష రోబోటిక్స్‌లో అవకాశాలను కల్పించడం స్పేస్ చాలెంజ్ ఉద్దేశం.
‘ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్-యూఆర్‌ఎస్‌సీ 2024’ నిర్వహించనున్న ఇస్రో
‘ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్-యూఆర్‌ఎస్‌సీ 2024’ని నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించారు. ఈ ఛాలెంజ్‌లో ప్రధానంగా ఒక ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అందులో సంస్థాగత బృందాలు రోబోలను నిర్మించాలి. అవి గ్రహాంతర పరిస్థితుల నడుమ పోటీ పడాలి. స్పేస్ రోబోటిక్స్‌లో ఎదురయ్యే వాస్తవ సవాళ్ల ఆధారంగా లక్ష్యాలను నెరవేర్చాలి. చక్రాలు లేదా కాళ్లతో కూడిన రోవర్ల డిజైన్లను విద్యార్థుల నుంచి కోరుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. తుది ఆన్‌సైట్ పోటీని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
చంద్రయాన్ లో కొత్త కొత్త ప్రయోగాలు
అంతరిక్ష పరిశోధనలు భవిష్యత్ లో కొత్త పుంతలు తొక్కనున్నాయి. ఎవరూ ఊహించని విజయాలను ఇస్రో సాధించే అవకాశం ఉంది. విజయవంతంగా ల్యాండర్ నుంచి చంద్రునిపై దింపిన తర్వాత తదుపరి దశల వారీగా మనుషుల్ని పంపేందుకు సన్నాహాలు చేయనుంది. ప్రపం చంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థగా ఇస్రో గుర్తింపు పొందింది. అంతే కాకుండా.. అత్యంత సమర్థమైన సంస్థగా కూడా పేరు తెచ్చుకుంది.