AP Land Rights Act: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఏపీలో భూ హక్కుల చట్టాన్నిఅమల్లోకి తెచ్చింది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం (YSRCP Govt). ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023 (Land Titling Act) ను ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచే అమల్లోకి తెస్తున్నట్టు.. ఇటీవల జీవో నంబర్ 512 జారీ చేసింది జగన్ ప్రభుత్వం. అయితే... దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ నిన్న (మంగళవారం) విడుదలైంది. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో... రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. భూమి (Land) హక్కులపై యజమానులు, కొనుగోలుదారులకు పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. మోసాలకు తావులేకుండా... యజమానులను శాశ్వత హక్కుదారులను గుర్తించి రిజిస్ట్రర్‌లో నమోదు చేస్తారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలోనే భూ హక్కుల చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్) అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేదు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఎలా అమలు చేస్తారు?
భూ హక్కుల చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్) ప్రకారం... స్థిరాస్థి హక్కుల రిజిస్టర్ రూపొందిస్తారు. దీనివల్ల.... యజమాని తప్ప మరొకరు స్థిరాస్థిని అమ్మే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్థుల శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్‌తోపాటు కొనుగోలు రిజిస్టర్‌ను కూడా తయారుచేస్తారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ఇందుకుగాను... ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి కింద మండల స్థాయిలో లాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు.
ల్యాండ్ టైట్లింగ్ అధికారి బాధ్యతలు
భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారికే ఉంటుంది. స్థిరాస్థి గుర్తింపు సంఖ్య, స్థిరాస్థి ఉన్న ప్రాంతం, యజమాని పేర్లు, బదిలీలకు సంబంధించిన సమాచారం, అలాగే ఆస్తి వారసత్వ సమాచారం, ఇంటిపై ఉన్న దావాలకు సంబంధించిన సమాచారం ఇలా మొత్తం వివరాలతో టైటిల్ రిజిస్ట్రీని నిర్వహిస్తారు. పలు దశల్లో విచారించి... ఎంక్వైరీ చేసిన తర్వాత... టైట్లింగ్ అధికారి భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తిస్తారు. అతని పేరును భూహక్కుదారుడి రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
భూ హక్కుల చట్టం ప్రకారం... ఒకసారి రిజిస్టర్‌లో భూహక్కుదారుడి పేరు నమోదైన తర్వత... ఆ భూములపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యునల్స్‌లోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప కోర్టుకు వెళ్లడానికి లేదు. రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్ తీర్పులపైనే హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో.. హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను నియమించాల్సి ఉంటుంది. ఇకవేళ టైటిల్స్ రిజిస్టర్‌లో ఉన్న భూమి హక్కుదారుడు మరణిస్తే... వారసులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు మరణించిన భూ హక్కుదారుడి పేరును.. వారసుల పేర్లతో భర్తీ చేసుకోవచ్చు. ఈ అధికారం ల్యాండ్ టైట్లింగ్ అధికారికే ఉంటుంది. ఇలా... భూ హక్కుల చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్) అమల్లోకి రావడం వల్ల భూమి యజమానులు, కొనుగోలుదారులకు పూర్తి భరోసా లభించినట్టు అవుతుంది.