Railway Minister Ashwini Vaishnav News: గత ఏడాది అక్టోబర్ 29న జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటన విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే స్టేషన్ కు సమీపంలో జరిగింది. విశాఖపట్నం నుంచి రాయగడ వైపు రాయగడ పాసింజర్ వెళుతుండగా, అదే లైన్ లో వెనుక నుంచి వచ్చిన పలాస ప్యాసింజర్.. రాయగడ పాసింజర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలు బోగీలు నుజ్జునుజ్జు కాగా, 14 మంది మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. విచారణకు సంబంధించి నిపుణుల కమిటీ అందించిన నివేదిక ఆధారంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు.


పైలట్, కో పైలట్ క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే ప్రమాదం


14 మంది చావుకు కారణమైన రైలు విచారణ జరిపిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బయటపెట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో పైలట్, కో పైలట్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో మ్యాచ్ చూస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇద్దరూ క్రికెట్ మ్యాచ్ ను చూస్తూ లీనమైపోయారని, ఈ క్రమంలో ఏం జరుగుతుందో పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేశారు. ఈ తరహా ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే వ్యవస్థలను ఇన్స్టాల్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో భాగంగానే ఈ అంశాలు తేలాయి. ఆ అంశాలను తాజాగా రైల్వే శాఖ మంత్రి బయట పెట్టడం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. 


ప్రమాదంతో ఆందోళన


విశాఖకు దగ్గరలో జరిగిన ఈ ప్రమాదంపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అయింది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన రోజున రాయగడ, పలాస ప్యాసింజర్లలో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తున్నారు. వెనుక నుంచి వచ్చిన ట్రైన్ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. పాసింజర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో చాలావరకు ప్రమాద తీవ్రత తగ్గుముఖం పట్టిందని అప్పట్లోనే ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్టులో రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ తరహా ప్రమాదాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అందుకు అనుగుణంగానే రైల్వే శాఖ అధునాతన వ్యవస్థలను ఇన్స్టాల్ చేసేందుకు సిద్ధమవుతుండడం కొంత ఉపశమనం కలిగించే అంశం గాని చెబుతున్నారు.