Rahul Gandhi Speech: 


సుదీర్ఘ ప్రసంగం..


రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించినప్పటి నుంచి ఆయన పార్లమెంట్‌లో ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ మొదలైంది. గతంలో అదానీ వ్యవహారంపై మాట్లాడిన రాహుల్...మోదీ సర్కార్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. ఆ తరవాత ఉన్నట్టుంది పరువు నష్టం దావా కేసులో ఇరుక్కుని న్యాయ పోరాటం చేసి చివరకు విజయం సాధించారు. లోక్‌సభ సభ్యత్వాన్ని తిరిగి పొందారు. అందుకే ఈ సారి ఎలా మాట్లాడతారు..? మోదీని మళ్లీ టార్గెట్ చేస్తారా...? అన్న ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగింది రాహుల్ ప్రసంగం. మొట్ట మొదట స్పీకర్‌కి థాంక్స్ చెప్పిన రాహుల్ ఆ తరవాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొదలు పెట్టడం పెట్టడమే మోదీ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. జోడో యాత్ర ఇంకా ముగిసిపోలేదని, రెండో ఫేజ్ త్వరలోనే మొదలవుతుందంటూ స్పీచ్ స్టార్ట్ చేసిన ఆయన...ఆ తరవాత మణిపూర్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా మాటల దాడి చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతా ఆగ్రహంతో కనిపించారు రాహుల్ గాంధీ. అదానీ వ్యవహారంలోనూ మోదీ సర్కార్‌ని ప్రశ్నించినా...ఈ సారి మాత్రం ఆ డోస్ మరింత పెరిగింది. చాలా సెటిల్డ్‌గా మాట్లాడుతూనే చేయాల్సిన విమర్శలన్నీ చేశారు. జోడో యాత్రలో ఎదురైన అనుభవాల నుంచి మణిపూర్ బాధితుల ఆవేదనను తెలుసుకోవడం వరకూ అన్ని విషయాలూ ప్రస్తావించారు. బీజేపీ గట్టిగా నినాదాలు చేసినప్పటికీ ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 


వాయిస్ పెంచిన రాహుల్..


క్రమంగా తన వాయిస్‌ని పెంచిన రాహుల్...మణిపూర్‌లో భరత మాతను బీజేపీ హత్య చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పార్లమెంట్‌లో దుమారం రేపాయి. మధ్యమధ్యలో బీజేపీ ఎంపీలు అడ్డుతగులుతుంటే "కాస్త మంచినీళ్లు తాగండి" అంటూ సెటైర్లు కూడా వేశారు రాహుల్. మణిపూర్‌ విషయంలో ఆయన గట్టిగానే మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు ముందు నుంచే చెబుతున్నా...ఈ స్థాయిలో ప్రసంగం ఉంటుందని ఎవరూ ఊహించలేదు. భరత మాతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యే అవకాశాలున్నాయని తెలిసినా...అవేమీ పట్టించుకోకుండా చాలా దూకుడుగా కనిపించారు. ఈ కామెంట్స్‌ని ప్రస్తావిస్తూ నైతికంగా, రాజకీయంగా కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టే పనిలో ఇప్పటికే పడిపోయింది బీజేపీ. పైగా జాతీయవాదంతోనూ తిప్పికొట్టాలని చూస్తోంది. ఇవన్నీ తెలియకుండానే రాహుల్ అలాంటి కామెంట్స్ చేశారా..? లేదంటే వ్యూహాత్మకంగానే ఇలా దూకుడుగా వ్యవహరించారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఇండియా కూటమి పేరుతో దాదాపు 26 పార్టీలు ఒక్కటయ్యాయి. ప్రధాని మోదీ పదేపదే ఈ కూటమిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌పై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. అందుకే...ప్రతిదాడి మొదలు పెట్టారు రాహుల్. అదీ పార్లమెంట్ సాక్షిగా. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అంటూ నినదించారు. ఇదంతా బాగానే ఉన్నా...కాంగ్రెస్‌కి అవినీతి మరకను పదేపదే గుర్తు చేస్తూ బీజేపీ ఎంపీలు ప్రతిసారీ ఎదురు దాడి చేస్తుంటారు. ఈ సారి కూడా అదే జరిగింది. రాహుల్‌కి దీటుగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు చేశారు. కశ్మీర్‌ తగలబడిపోతే ఏం చేశారని ప్రశ్నించారు. దీంతో మరోసారి సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడిపోయింది కాంగ్రెస్


Also Read: మణిపూర్‌ సాక్షిగా బీజేపీ భరత మాతను హత్య చేసింది, రాహుల్ సంచలన వ్యాఖ్యలు