Rahul Gandhi: ప్రధాని మోదీ ఐరోపా పర్యటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించిన కొన్ని గంటల్లోనే రాహుల్ గాంధీని ఇరుకున పడేసే ఓ వీడియోను బీజేపీ బహిర్గతం చేసింది. బీజేపీ నేతలు కొంత మంది రాహుల్ గాంధీ విదేశాల్లోని ఓ నైట్ క్లబ్బులో పార్టీ చేసుకుంటున్న వీడియోను షేర్ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ కూడా రిపోర్ట్ చేసింది. ఫలానా తేదీల్లాంటివి ఏమీ లేని ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఖాట్మండులోని నైట్‌ క్లబ్‌లో మరో మహిళతో కలిసి పార్టీ చేసుకుంటున్నట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం రాసింది. రాహుల్ గాంధీ చుట్టుపక్కల వారు కొంత మంది మద్యం సేవిస్తున్నట్లుగా కనిపిస్తోంది.






ఏఎన్ఐ కథనం ప్రకారం.. అసలే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ ఈ వీడియో ఇలా వైరల్ కావడం మరింత చర్చనీయాంశం అవుతోంది. 


కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న దాని ప్రకారం.. రాహుల్ గాంధీ ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నేపాల్ రాజధాని ఖాఠ్మాండూకు సోమవారం (మే 2) మధ్యాహ్నం వెళ్లారు. మియన్మార్‌లో నేపాలీ మాజీ రాయబారి భీమ్ ఉదాస్, తన కుమార్తె వివాహం కోసం రాహుల్‌ను ఆహ్వానించారు. అందుకే, ఆయన నేపాల్‌కు వెళ్లారు. ఉదాస్ కుమార్తె సుమ్నిమా గతంలో సీఎన్ఎన్ వార్తా సంస్థకు ప్రతినిధిగా పని చేశారు.


బీజేపీ విమర్శలు


బీజేపీ నేత తజిందర్ బగ్గా మాట్లాడుతూ.. ‘‘మొదట, నేను కాంగ్రెస్ నిజాయతీని అభినందిస్తున్నాను. వారికి సెల్యూట్ చేస్తున్నాను. దేశంలో ప్రస్తుతం సంక్షోభం ఉంది. దేశం ఇలా ఉంటే సారు విదేశాల్లో ఉండడానికి ఇష్టపడతారు. దేశ చరిత్రలో ఏ పార్టీ నేత కూడా ఇంత నిజాయతీపరుడు అని నేను అనుకోను. ఎవరి నాయకుడు విదేశాలలో పార్టీలు చేస్తున్నాడో ఆ పార్టీ నాయకులు తెలుసుకొని మాట్లాడాలి.’’ అని అన్నారు.


‘‘దేశంలో సంక్షోభం ఉంది, కానీ సార్ విదేశాల్లో ఉండటానికి ఇష్టపడతారు’’ అని ప్రధాని మోదీ జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌ పర్యటనలను ఉద్దేశించి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దీనికి బీజేపీ నేతలు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు.