Rahul Gandhi Gets EC Notice:



మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు పంపింది. మోదీని Panauti (దురదృష్టవంతుడు)  అని రాహుల్‌ విమర్శలు చేశారు. భారత్‌ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మోదీయేనని, ఆయన రావడం వల్లే గెలుచుకోలేకపోయామని అన్నారు. ప్రధాని మోదీ పిక్‌పాకెట్ అని కూడా విమర్శించారు రాహుల్. దీనిపై బీజేపీ తీవ్రంగా మండి పడింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకున్న ఈసీ రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. నవంబర్ 25లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై బీజేపీ సీనియర్ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అభ్యంతరకరమైన భాషను వాడడం ఏ మాత్రం సరికాదని, చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. 


 






ఇంతకీ రాహుల్ ఏమన్నారు..?


రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. మోదీ వెళ్లకపోయింటే కచ్చితంగా ఇండియా వరల్డ్‌కప్‌ని గెలిచి ఉండేదని, ఆయన వెళ్లడం వల్లే ఈ దురదృష్టం పట్టిందని మండి పడ్డారు. "ప్రధాని మోదీ ఉన్నట్టుండి టీవీలో ప్రత్యక్షమవుతారు. ప్రసంగాలు ఇస్తారు. హిందూ ముస్లింలు అంటూ గొప్పగొప్ప మాటలు మాట్లాడతారు. కొన్ని సార్లు క్రికెట్‌ మ్యాచ్‌కి కూడా వెళ్తారు. మనవాళ్లు కచ్చితంగా కప్ గెలిచేవాళ్లు. కానీ ప్రధాని మోదీ వెళ్లడం వల్ల అది కుదరలేదు. ఆయన వల్లే ఈ దురదృష్టం వెంటాడింది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ


రాహుల్ స్పీచ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన బీజేపీ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చాలా తీవ్రంగా స్పందించారు. "ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు" అంటూ మండి పడ్డారు. మరో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అయితే "మతిస్థిమితం తప్పినట్టుంది" అని రాహుల్‌కి కౌంటర్ ఇచ్చారు. ఈసీ నోటీసులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. నోటీసులిస్తే ఇవ్వనివ్వండి సమాధానం చెబుతాం అని తేల్చి చెప్పారు. రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో అంత అభ్యంతరకరమైంది ఏమీ లేదని, నోటీసులకు తగిన బదులిస్తామని స్పష్టం చేశారు.