సూరత్ కోర్టు దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తాజాగా కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లోని అధికారిక నివాసాన్ని రాహుల్ గాంధీ ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీలోగా రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని సభ హౌసింగ్ కమిటీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 23 నుంచి అధికారిక నివాసం రద్దు అవుతుందని నోటీసులలో పేర్కొన్నారు.
ఎంపీగా అనర్హత వేటు పడటంతో నేతలు వారికి కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. మార్చి 23న రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై వేటు పడింది. దాంతో నెల రోజుల వ్యవధిలో సభ్యుడు/సభ్యురాలు తమకు కేటాయించిన నివాసాన్ని నెల రోజుల వ్యవధిలో ఖాళీ చేయాలి. ఈ మేరకు రాహుల్ గాంధీకి కేటాయించిన ఎంపీ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ తాజాగా సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది.
పరువు నష్టం కేసులో జైలు శిక్ష
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనను మార్చి 23న దోషిగా తేల్చడమే కాకుండా రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అప్పటి నుంచి ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుందన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఉదయం లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు రాహుల్. ఆ తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నారు సెక్రటరీ జనరల్.
"పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీని సూరత్ దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని వాయనాడ్ ఎంపీగా ఉన్న ఆయనపై అనర్హతా వేటు వేస్తున్నాం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజ్యాంగ బద్ధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం" - నోటిఫికేషన్
మోదీ అనే ఇంటి పేరు దొంగలకే ఎందుకు ఉంటోంది అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేయగా, సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం రాహుల్ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.
2004లోనే నివాసం కేటాయింపు
రాహుల్ గాంధీ 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించగా.. ఢిల్లీలో 12 తుగ్లక్ లేన్ లో ఎంపీగా అధికారిక నివాసం కేటాయించారు. ఆపై 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినా, కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందారు. దాంతో ఆయనకు అధికారిక నివాసాన్ని మరోసారి కొనసాగించారు.
రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆ బంగ్లాను ఖాళీ చేయాలని 2020లో ఆమెకు కేంద్రం సూచించింది. ఎస్సీజీ సెక్యూరిటీ తొలగించినందుకు ఆమె ఎంపీల అధికారిక నివాసంలో ఉండేందుకు అర్హులు కాదని కేంద్రం గతంలోనే పేర్కొంది.