Bilkis Bano Case:


డాక్యుమెంట్‌లు సిద్ధం చేసుకోండి : సుప్రీం కోర్టు 


తనపై అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయడంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బిల్కిస్ బానో. చాన్నాళ్లుగా ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం...కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గుజరాత్ ప్రభుత్వానికీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 18వ తేదీన మరోసారి విచారిస్తామని వెల్లడించింది. జస్టిస్ కేఎమ్ జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం...ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. ఆ దోషులను ఎందుకు విడుదల చేశారో వచ్చే విచారణ తేదీ నాటికి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. డాక్యుమెంట్‌లు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇందులో భావోద్వేగాలకు చోటు లేదని, కేవలం చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని వెల్లడించింది. 


"మా ముందు ఎన్నో హత్యా కేసులు విచారణకు వచ్చాయి. ఆయా కేసుల్లో దోషులు ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఈ కేసులోనూ అదే నిబంధన పాటించాల్సిన అవసరం లేదా?" 


- సుప్రీంకోర్టు 






ఇప్పటికే నోటీసులు..


గతేడాది ఆగస్టులో దోషులను విడుదల చేసినప్పటి నుంచి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా  సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలవుతూనే ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా పిటిషన్ వేశారు. ఈ దోషులు మళ్లీ జైలుకెళ్లాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గతేడాది ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేశారు. అప్పటి నుంచి గుజరాత్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అంత దారుణానికి ఒడిగట్టిన వారిని అంత సులభంగా ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. బిల్కిస్ బానో కూడా ఈ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారు. అయితే...వీరిని విడుదల చేసే సమయంలో గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 1992 జులై 9న పాస్ చేసిన రెమిషన్ పాలసీ ఆధారంగా చూపిస్తూ...ఈ నిర్ణయం సరైందేనని తేల్చి చెప్పింది. "జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లను సత్ప్రవర్తన కింద 14 ఏళ్ల జైలు శిక్ష తరవాత విడుదల చేసేందుకు అవకాశముంది" అని వివరణ కూడా ఇచ్చుకుంటోంది. బిల్కిస్‌ బానో కేసులో దోషులకు రెమిషన్‌ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవ్వగా...గుజరాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది సర్వోన్నత న్యాయస్థానం. అందులో భాగంగానే...గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది. గతంలోనే...సుప్రీం కోర్టు బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విచారించింది. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. అంతే కాదు. గుజరాత్ ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 


Also Read: Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం