Rahul Defamation Case:



సత్యమేవ జయతే: కాంగ్రెస్ 


పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీ న్యాయ పోరాటం మొత్తానికి ఫలించింది. సుప్రీంకోర్టు స్టే కారణంగా గతంలో ఆయనను దోషిగా తేల్చిన తీర్పు చెల్లకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కాస్త జనాల్లో తరచూ తిరుగుతూ పార్టీ క్యాడర్‌ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీకి ఈ తీర్పు మరింత జోష్ ఇచ్చిందనే చెప్పాలి. పైగా ఈ మధ్యే కర్ణాటకలో బీజేపీపై గెలిచిన ఉత్సాహంతో ఉంది కాంగ్రెస్. కాస్త దృష్టి పెడితో లోక్‌సభ ఎన్నికల్లోనూ గట్టిగానే సీట్లు సంపాదించుకోవచ్చు అన్న ధీమాతో ఉంది. కాకపోతే...రాహుల్ గాంధీ గ్రౌండ్ లెవెల్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ ఆయనపై అనర్హతా వేటు పడడం కాంగ్రెస్‌కి సవాలుగా మారింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ లైన్ కూడా క్లియర్ అయినట్టే. సరిగ్గా ఎన్నికల ముందు ఆయనపై ఇలా అనర్హత వేటు పడడం, న్యాయ పోరాటంలో గెలవడం లాంటి పరిణామాలతో ఎంతో కొంత కాంగ్రెస్‌కి కలిసొచ్చే అవకాశాలున్నాయి. అందులోనూ రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా దారి దొరికింది. అందుకే...రాహుల్ ఎంపీ సభ్యత్వం ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న ఆసక్తికర చర్చ మొదలైంది ఇండియా కూటమిలో.


ఇదీ ప్రాసెస్..


ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు కాపీని లోక్‌సభ సెక్రటేరియట్‌కి పంపుతారు. ఆ తరవాత స్పీకర్‌ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయడానికి ఆస్కారం ఉండదు. సుప్రీంకోర్టే స్వయంగా కాపీలు పంపింది కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ ఆ కాపీని ఎన్నికల సంఘానికి పంపుతారు. ఇదంతా జరగడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం పడుతుంది. అంటే అంతా సవ్యంగా జరిగితే వచ్చే వారం రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రీస్టోర్ చేసే అవకాశాలున్నాయి. అప్పుడే రాహుల్ గాంధీకి పార్లమెంట్‌లో అడుగు పెట్టొచ్చు. 


కాంగ్రెస్ మాత్రం మరో 24 గంటల్లోనే రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది. రాహుల్ ఈ పార్లమెంట్ సమావేశాల్లో కచ్చితంగా పాల్గొనాలని, అందుకు లైన్ క్లియర్ చేసిందని తేల్చి చెబుతోంది. ఈ తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. "ఇది విద్వేషంపై ప్రేమ సాధించిన విజయం" అని పోస్ట్ చేశారు. 


"రాహుల్ గాంధీని దోషిగా చూపించడానికి బీజేపీ నానా కష్టాలు పడింది. కానీ రాహుల్ గాంధీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన తల వంచలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచారు"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 






కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కూడా స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన కుట్ర విఫలమైందని వెల్లడించారు. 


"సత్యమేవ జయతే. రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన కుట్ర భగ్నమైంది. రాహుల్ సాధించిన ఈ విజయం మోదీని గట్టిగా దెబ్బ తీస్తుంది"


- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ


Also Read: రాహుల్‌ గాంధీకి బిగ్ రిలీఫ్- పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టు స్టే