న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ నేతలపై విపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ నేతలు పరువు నష్టం దావా వేస్తే మాత్రం వెనక్కి తగ్గాల్సి వస్తోంది. రాహుల్ గాంధీ నుండి దిగ్విజయ సింగ్ వరకు పలువురు నేతలు ఇదే తీరుగా వ్యవహరించి వెనక్కి తగ్గడంతో రాజకీయంగా వారి ప్రత్యర్థులు, లేక టార్గెట్ చేసిన వ్యక్తులదే పైచేయి సాధిస్తున్నారు. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ ముర్దేశ్వర్ పురికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు.
చాలా కాలంగా నడుస్తున్న పరువు నష్టం కేసు ముగిసింది.
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో లక్ష్మీ ముర్దేశ్వర్ పూరీ ఆస్తిని కొనుగోలు చేయడంపై సాకేత్ గోఖలే 2021లో ట్వీట్లు చేశారు. పూరీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా క్షమాపణ చెప్పాలని తృణమూల్ నేతను ఆదేశించింది. జైలు శిక్ష విధింపు తీర్పివ్వడంతో సాకెత్ గోఖలే వెనక్కి తగ్గారు. ₹50 లక్షల జరిమానాతో పాటు, మరోసారి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా కోర్టు తీర్పిచ్చింది. రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు. ముందు కామెంట్లు చేయడం చివరికి తప్పని పరిస్థితుల్లో క్షమాపణ చెబుతున్నారు.
ప్రధాన మంత్రి మోదీని దూషించడం, సర్జికల్ స్ట్రైక్స్, ఆర్‌ఎస్‌ఎస్‌ను చారిత్రక హత్యల్లోకి లాగడం, జాతీయ భద్రతా కార్యకలాపాలపై రాజకీయం చేయడం తరువాత ఎదురయ్యే పరిణిమాలతో వెనక్కి తగ్గుతున్నారు. రాహుల్ గాంధీ 2014లో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమన్నారు.సుప్రీంకోర్టులో పరువు నష్టం కేసు తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌తో లింక్ ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడానని, ఆ సంస్థను కాదు అని రాహుల్ స్పష్టం చేశారు. విచారణ సమయంలో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
ప్రధాని మోదీని "ఖూన్ కి దలాలీ" అని 2016లో రాహుల్ గాంధీ అన్నారు. సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌పై రాజకీయం చేయగా ఎదురుదెబ్బలు తగిలాయి. సాయుధ దళాల చర్యలను తప్పు పట్టలేదని వారికి మద్దతు ఉంటామంటూ వివరణ ఇవ్వవలసి వచ్చింది. 2019లో రాఫెల్ ఒప్పందంపై ఆరోపణల్లోనూ ఇలాగే జరిగింది. "చౌకీదార్ చోర్ హై" వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ధిక్కార నోటీసుతో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సంజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, జైరామ్ రమేష్, దిగ్విజయ సింగ్ పలువురు పరువు నష్టం వ్యాఖ్యలు చేసి ఇబ్బంది పడ్డారు.
2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నీచమైన వ్యక్తి అని మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించారు. ఈ వ్యాఖ్యలతో కులం వివాదం, అహంకారపూరిత వైఖరి అని వాదన లెవనెత్తారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మణిశంకర్ అయ్యర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను అన్నది తక్కువ స్థాయి ప్రవర్తన అని, నీచమైన అని కాదని వివరణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది.
NSA అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్ పై ఆర్థిక అక్రమాల ఆరోపణలతో జైరామ్ రమేష్ చిక్కుల్లో పడ్డారు. మీడియా కథనం ఆధారంగా 2019లో ఆయన ఆరోపణలు చేశారు. పరువు నష్టం దావా వేయగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పారు. తాను సొంతంగా చేసిన వ్యాఖ్యలు కావని, ఓ కథనం ఆధారంగా మాట్లాడానని వివరణ ఇచ్చారు. 2017లో ఆప్ నేత కపిల్ మిశ్రాపై జరిగిన దాడిలో బిజెపి నేత అంకిత్ భరద్వాజ్‌ను సంజయ్ సింగ్ తప్పుగా ఇరికించారు. నిరాధారమైనదని ఆరోపణలని తేలడంతో సంజయ్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. RSS సిద్ధాంతకర్త M.S. గోల్వాల్కర్ పై దిగ్విజయ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, చట్టపరమైన చర్యలకు దారితీసింది. లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని 2024లో కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
నిరాధార ఆరోపణలు చేయడం ఎందుకు, చివరికి క్షమాపణ చెప్పడం ఎందుకు అని ఎన్డీయే నేతలు విపక్షాలకు హితవు పలుకుతున్నారు. ఒకవేళ తమను ఎదుర్కోవాలంటే సరైన ఆరోపణలు, విమర్శలు చేసి, వాటిని నిరూపించుకోవాలని సవాల్ చేస్తున్నారు. లేకపోతే ఇప్పటికే కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారని.. రాజకీయ మైలేజ్ కోసం చేసేవి చట్టపరమైన చర్యలకు దారి తీశాయని గుర్తుచేశారు. ఇప్పటికే మీ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోగా, ఇకనైనా బాధ్యతగా నడుచుకుంటారా లేక ఇది ఇలాగే కొనసాగుతుందా అని ఎద్దేవా చేస్తున్నారు.