India at 2047 Defence: న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ కోసం రాఫెల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాలైనా, లేక బోయింగ్ F/A-18 రెండింట్లో ఏదైనా ఓకే అని నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ అన్నారు. ఏబీపీ లైవ్ తో మాట్లాడుతూ.. భారతదేశం యొక్క కొత్త విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ కోసం డసాల్ట్ ఏవియేషన్ కు చెందిన రాఫెల్, లేదా బోయింగ్ F/A-18 సూపర్ హార్నెట్ లలో ఏది కావాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇండియన్ నేవీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని, ఫైనల్ డెసిషన్ వరకూ వేచి ఉంటామన్నారు.


ఏబీపీ మీడియాతో నేవీ చీఫ్ హరి కుమార్ మాట్లాడుతూ.. నావికా దళానికి ఎలాంటి యుద్ధ పరికరాలు, కంపెనీల వాహనాలు వినియోగించాలి అనే దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం మాకు ఆ రెండింటిలో ఏదైనా ఒకే అని ఇదివరకే స్పష్టం చేశాం. రక్షణ మంత్రిత్వ శాఖ త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. కానీ కొన్ని కొత్త  సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఇదివరకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రాఫెల్ ఫైటర్ జెట్స్ అందుబాటులోకి వచ్చాయని, నేవీకి సైతం ఇదే నిర్ణయం తీసుకుంటే విడి భాగాలకు సంబంధించి సమస్య ఉండదని నేవీ చీఫ్ అభిప్రాయపడ్డారు.


నౌకాదళం ఏ ఎయిర్ క్రాఫ్ట్ ల వైపు మొగ్గు చూపుతుందని  అడిగినప్పుడు.. ప్రతి దానికి ప్లస్ పాయింట్స్, బలహీనతలు ఉంటాయి. కనుక ఏది మెరుగైనదో కేంద్ర రక్షణశాఖ నిర్ణయానికే వదిలేస్తున్నాం అన్నారు హరి కుమార్. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు.  మేము ఆత్మనిర్భర్ భారత్‌ ను ప్రోత్సహిస్తున్నందున దేశంలో రెండు ఇంజిన్లతో ఆధునాతన ఫైటర్ జెట్ లను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.


ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రూపొందించే ఈ నమూనా 2026-27 నాటికి సిద్ధమవుతుందని, 2034 నాటికి భారత నేవీలోకి అందుబాటులోకి రావొచ్చునని దీమా వ్యక్తం చేశారు. భారత నేవీ ప్రస్తుతం INS విక్రాంత్ కోసం రష్యాకు చెందిన MiG 29Kని నడుపుతోంది. అయితే భవిష్యత్తులో పూర్తిగా స్వదేశీ యుద్ధ విమానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని.. ఇప్పటివరకూ దిగుమతి చేసుకున్న రాఫెల్ M లేక సూపర్ హార్నెట్ తాత్కాలికంగా మాత్రమే ఉపయోగిస్తామని నేవీ చీఫ్ స్పష్టం చేశారు.


యుద్ధ విమాన వాహక నౌకల అవసరం ఎంటన్నది పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఇదే తీరుగా దేశంలోనే సొంత టెక్నాలజీతో ఎయిర్ క్రాఫ్ట్ లతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ కారియర్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కొన్నేళ్లు సమయం పడుతుందన్నారు. ఈ క్రమంలో గోవాలో రాఫెల్ ఎం, F/A-18 ట్రయల్స్ చేయగా, సక్సెస్ సాధించామన్నారు.


మలబార్ విన్యాసాలతో పరిస్థితిలో మార్పులు
భౌగోళిక రాజకీయ పరిస్థితుల నడుమ ఈ ఏడాది చివర్లో  మలబార్ నేవల్ విన్యాసాలు చేపట్టనున్నారు. ప్రతి సంవత్సరం లాగే భారత భాగస్వామ్య దేశాలైన జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా నావికాదళాలు విన్యాసాలతో ఈసారి కొంత పురోగతి సాధించే అవకాశం ఉందని నేవీ చీఫ్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించనున్న మలబార్ నౌకాదళ విన్యాసాలలో కొత్త దేశం ఏదీ చేర్చాలన్న ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు.